అవ్వాతాతల పింఛన్ల నిలుపుదలకు కుతంత్రం

Apr 2,2024 23:32 #ap cm jagan, #speech

-ప్రతిపక్ష కూటమిని చిత్తు చేయండి
-బాబుకు ఓట్లేస్తే సంక్షేమానికి పాతరే!
-పేదల భవిష్యత్తును తేల్చే ఎన్నికలివి
-175 అసెంబ్లీ, 25 ఎంపీలను గెలిపించాలి
-మదనపల్లె ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్‌
ప్రజాశక్తి- కడప ప్రతినిధి :రాష్ట్రంలోని 66 లక్షల మంది వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళల పింఛన్ల నిలుపుదలకు టిడిపి అధినేత చంద్రబాబు పన్నాగం పన్నారని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని టిప్పు సుల్తాన్‌ మైదానంలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో మాట్లాడారు. రాష్ట చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో సంక్షేమ పాలన సాగించామని, కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమాన్ని అందించామని అన్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా సచివాలయాలు మొదలుకుని ఆర్‌బికెలు, విలేజ్‌ క్లినిక్‌లు, ఇంటింటికీ మందులు, ఇంగ్లిషు మీడియం చదువులు, ట్యాబ్‌లు, డిజిటల్‌ బోధన, కనిపిస్తాయని, బాబు హయాంలో చెప్పుకోవడానికి ఎటువంటి ట్రేడ్‌ మార్కూ లేదని వివరించారు. ఇటువంటి సానుకూలతల నేపథ్యంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలుపొందాలన్నారు. శాశ్వత భూ హక్కులు కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉండేవని, వైసిపి అధికారంలోనికి వచ్చాక అదనంగా 2.30 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించామని, అక్కచెల్లెమ్మల చేతిలో 31 లక్షల ఇళ్ల పట్టాలను పెట్టామని వివరించారు. 17 మెడికల్‌ కళాశాలలు, ఏడు సీపోర్టులు, పది షిప్పింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 2014 ఎన్నికల తరహాలో చంద్రబాబు… పవన్‌, మోడీలతో ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ కూటమి కట్టి మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అప్పట్లో ఆ కూటమి ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని తెలిపారు. రైతులకు రుణాలు, డ్వాక్రా రుణమాఫీ, మహలక్ష్మి, ఇంటింటికీ ఉద్యోగం, మూడు సెంట్ల ఇళ్ల స్థలం, పది వేల కోట్ల రూపాయలతో బిసి సబ్‌ ప్లాన్‌, రాష్ట్రంలోని నగరాలను సింగపూర్‌ చేస్తామనే ప్రధాన హామీలు ఉన్నాయని, ఏ ఒక్కటైనా అమలు చేశారా? అని అడుగుతున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రంగురంగుల కలర్లతో, కరపత్రాలతో, సూపర్‌ సిక్స్‌ పేరుతో మోసగించడానికి మళ్లీ ముందుకు వచ్చారని విమర్శించారు. ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా? వద్దా? అని ప్రశ్నించారు. మైనార్టీల నాలుగు శాతం రిజర్వేషన్‌తో చెలగాటం ఆడుతున్నాడని విమర్శించారు. ఇది ఎమ్మెల్యేలకు, ఎంపీల గెలుపునకు సంబంధించిన ఎన్నికలు కావని, పేదల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. మీ బిడ్డ మీ కోసం 130 సార్లు బటన్‌ నొక్కాడని, మీరు రెండు బటన్లు నొక్కాలని విజ్జప్తి చేశారు. మరోసారి భారీ మెజార్టీ ఇస్తే మళ్లీ వలంటీర్లు మీ ముంగిటకు వచ్చి సంక్షేమాన్ని అందిస్తారని వివరించారు. ఈ ఎన్నికల్లో మోసాన్ని, అబద్ధాన్ని మట్టి కరిపించాలని కోరారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులైన మిథున్‌రెడ్టి, ఆకేపాటి అమరనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్టి, కొరముట్ల శ్రీనివాసులు, ద్వారకనాథరెడ్డి, నిస్సార్‌ అహ్మద్‌లను పరిచయం చేశారు.

➡️