చల్లబడిన ఆదిలాబాద్‌ – పలుచోట్ల వర్షం..!

Apr 10,2024 12:00 #adilabad, #cold weather, #Rain

ఉమ్మడి ఆదిలాబాద్‌ : నిప్పులుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి ప్రజలంతా ఆపసోపాలు పడుతున్నారు. మిట్టమధ్యాహ్నం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కాస్త నిదానంగా అక్కడక్కడ వాతావరణం చల్లబడుతోంది. ఎండ వేడిమికి ఉక్కపోతతో బాధపడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వాన కురిసింది. ఉగాది పండుగ వేళ … అక్కడి ప్రజలు హమ్మయ్యా.. అని ఆ చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. నిన్న అర్ధరాత్రి ఆదిలాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురవడంతో వేడెక్కిన నేల చల్లబడింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ అర్బన్‌లో 22.8 మిమీ వర్షపాతం నమోదు కాగా.. కొమురం భీం జిల్లా సిర్పూర్‌ టి లో 9 మిమీ వర్షపాతం నమోదైంది. నిర్మల్‌ జిల్లా ఎడ్‌బిడ్‌లో 7.3 మి.మీ. వర్షం కురిసింది.

ఆదిలాబాద్‌ జిల్లాలో ఏప్రిల్‌ మొదటి వారంలో ఎన్నడూ లేని విధంగా 44 డిగ్రీలకు చేరువ కావడం, వడగాలుల కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందిపడిన ప్రజలు ఒక్కసారిగా 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రానున్న రెండు రోజుల పాటు ఎండల తీవ్రత తక్కువగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనతో జిల్లావాసులకు ఊరట లభించింది. రానున్న రెండు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులుపడినట్లు సమాచారం.

➡️