సిపిఎం సీనియర్‌ నేత అనంతరామ శర్మ కన్నుమూత

– స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు పెన్నా అనంతరామ శర్మ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన స్వగ్రామం కట్టంగూర్‌ మండలం పిట్టంపల్లిలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. ఆయన కుమారులు పెన్నా రవికాంత్‌ శర్మ, యాదగిరి శర్మ, సరేశ్‌ శర్మ, కుమార్తె సీతమ్మ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అనంతరామ శర్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. కార్మిక నాయకునిగా, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు.
అంతకుముందు నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం అనంతరామశర్మ భౌతికకాయాన్ని ఉంచారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు రాష్ట్ర నేతలు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడుతూ.. సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ రైతాంగపోరాట యోధులు అనంతరామ శర్మ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలు యువతరానికి మార్గదర్శకం అని చెప్పారు. అనంతరామ శర్మ మరణం కమ్యూనిస్టు పార్టీలకు ముఖ్యంగా సిపిఎంకు తీవ్ర నష్టమని చెప్పారు. కేంద్ర కమిటీ సభ్యులు చెరుపెల్లి సీతారాములు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, మల్లు లక్ష్మీ, డిజి నరసింహారావు, జూలకంటి రంగారెడ్డి, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, నల్గండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, ఎండి.జహంగీర్‌, తదితరులు పాల్గన్నారు.
సిపిఎం ఎపి రాష్ట్ర కమిటీ సంతాపం
పెన్నా అనంతరామ శర్మ మృతికి సిపిఐ (ఎం) ఆంధ్రప్రదేశ్‌ కమిటీ తీవ్ర సంతాపం ప్రకటంచింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ఈ మేరకు ఒక సంతాప సందేశాన్ని పంపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించడమే కాక ఆ తర్వాత పార్టీ విచ్ఛిన్నాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలబడ్డ నాయకుడు అనంతరామ శర్మ అని కొనియాడారు. సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది.

➡️