పరస్పర సహకారంతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి

  • చంద్రబాబు లేఖపై స్పందించిన రేవంత్‌
  • 6న ప్రజా భవన్‌కు ఆహ్వానం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ముఖాముఖి చర్చలు అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. పరస్పర సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం స్పందించారు. చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరిస్తూ ఈ నెల 6న మధ్యాహ్నం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌ (ప్రగతి భవన్‌)కు ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్‌ లేఖ రాశారు. ”విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పర చర్చలు అవసరం. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరపున మిమ్నల్ని ఆహ్వానిస్తున్నాం” అని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి రేవంత్‌ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 6న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఖరారవడంతో సమావేశంలో చర్చించాల్సిన అజెండాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మంగళవారం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌ఒడిలతో సమావేశమైన సిఎం రేవంత్‌…విభజన సమస్యలపై చర్చించారు. శాఖల వారీగా నివేదికలు సిద్ధంచేయాలని ఆదేశించారు.

➡️