– సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలి
– అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోని వెలుగొండ పూర్తి
– కనిగిరిలో ఎన్నికల ఢంకా మోగించిన టిడిపి అధినేత చంద్రబాబు
ప్రజాశక్తి- కనిగిరి, ఒంగోలు బ్యూరో :నాడు ఎన్టిఆర్ ‘రా.. కదిలిరా..’ అని పిలుపునిస్తే ప్రభంజనమైందని, నేడు రాష్ట్రాన్ని కాపాడేందుకు ‘రా.. కదలిరా..’ అని నేను, పవన్ కల్యాణ్ సమిష్టిగా పిలుపునిస్తే ప్రజలు హర్షిస్తూ అండగా నిలిచేందుకు కదిలి రావడం హర్షదాయకమని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలందరూ సంపన్నులుగా మారి సంతోషంగా ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని వెలుగొండ సాధన ప్రాంగణంలో ఎన్నికల సమర శంఖారావాన్ని శుక్రవారం ఆయన పూరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగుల్లాగా ప్రజాప్రతినిధులను ట్రాన్స్ఫర్ చేయడం ఏమిటని, ఈ వైసిపి ప్రభుత్వంలోనే చూస్తున్నామని విమర్శించారు. ఎమ్మెల్యేలను ఎంపిలను ఒక చోట నుంచి మరోచోటికి ట్రాన్స్ఫÛర్ చేస్తున్నారని, ఒక ఇంటిలో పనికిరాని చెత్తను మరో ఇంటిలో వేస్తే ప్రజలు ఆదరిస్తారా అని పేర్కొన్నారు. వంద రోజులు యువత కష్టపడి సైకిల్ పాలన తీసుకువచ్చేందుకు కృషి చేస్తే మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రజలందరూ నరకం అనుభవిస్తున్నారని, ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆశించారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా పౌరుషాల గడ్డ అని బ్రిటీష్ వారి తుపాకీ గుండుకు రొమ్ము విరిచి చూపిన ప్రకాశం పంతులు పుట్టిన గడ్డ అని.. అందుకే ఈ గడ్డ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నానని తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగిన సర్వే ప్రకారం ఒకప్పుడు ఎక్కువ ఉద్యోగాలు పొందే రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు నిరుద్యోగాంధ్రప్రదేశ్ గా మారిందని విమర్శించారు. జాబు రావాలంటే బాబు కావాలనే పరిస్థితికి ప్రజలు వచ్చారన్నారు. తాను కియా కార్ల కంపెనీ తీసుకొస్తే… జగన్ మాఫియా తీసుకొచ్చారని, తాను నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే జగన్ గంజాయి ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని, ఇసుక మద్యం దోపిడీతో ప్రజల రక్తాన్ని తాగుతూ ప్రజాధనం తాడేపల్లి గూడెంలోని జగన్ ఇంటికి చేరుతుందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. సంకల్ప బలం, అనుభవంతో తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెడతానని, అందుకు ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం, సహకారం కావాలని కోరారు. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, కనిగిరి ప్రాంత ప్రజల నీటి కష్టాలు తెలుసని, తాను శ్రీకారం చుట్టిన వెలుగొండ ప్రాజెక్టుని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం అందులోని కనిగిరిని సస్యశ్యామలం చేస్తామన్నారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టాన్ని తొలగేలా సైకిల్ పాలన వచ్చేలా ప్రజలు ఆదరించాలని కోరారు.