8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు : స్పీకర్‌ ఆదేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎపి అసెంబ్లీలో ఎనిమిదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ మేరకు తమ్మినేని సీతారాం సోమవారం ఆదేశాలు ఇచ్చారు. టిడిపి నుండి వైసిపిలో చేరిన ఎమ్మెల్యేలు మద్దాల గిరి (గుంటూరు వెస్ట్‌), వల్లభనేని వంశీ (గన్నవరం), వాసుపల్లి గణేష్‌ (విశాఖ సౌత్‌), కరణం బలరాం (చీరాల), వైసిపి నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్‌), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), ఆనం రాంనారాయణరెడ్డి (వెంకటగిరి)లను అనర్హులుగా ప్రకటించారు. 26వ తేదీ నుండి అనర్హత అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా పార్టీల ఫిర్యాదు మేరకు పలుసార్లు పిలిపించి మాట్లాడిన స్పీకర్‌ సోమవారం తుది నిర్ణయం తీసుకున్నారు. వేర్వేరు కారణాలతో గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడంతో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఖాళీ అయ్యారు. దీంతో సభ్యుల సంఖ్య 166కు తగ్గింది. మొత్తం అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. తెలుగుదేశంలో చేరిన వైసిసి సభ్యులపై వేటు పడుతుందని అందరూ భావించారు. వైసిపిలో చేరిన టిడిపి సభ్యులపై ఇప్పట్లో వేటు వేయకపోవచ్చని అనుకున్నారు. ఎన్నికలు దగ్గర పడటం, పదవి కాలవ్యవధి కూడా తక్కువగానే ఉండటంతో స్పీకర్‌ రెండు పార్టీలకు చెందిన సభ్యులను అనర్హులుగా ప్రకటించారు.

➡️