ఫైబర్‌నెట్‌ కేసుపై బహిరంగ వ్యాఖ్యలొద్దు

Dec 13,2023 10:04 #fibernet case, #Nara Chandrababu

ఫైబర్‌నెట్‌ కేసుపై బహిరంగ వ్యాఖ్యలొద్దు

చంద్రబాబు, ఎపి ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోఫైబర్‌నెట్‌ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ను నిరాకరించిన హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళవారం సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. స్కిల్‌ కేసులో 17 ఏపై తీర్పు వెలువరించాల్సి ఉన్నందున పైబర్‌నెట్‌ కేసును జనవరి 17కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. వేరొక పిటిషన్‌లో కోర్టు ఆదేశించినప్పటికీ, తనపై కేసులు, ఆయన జైలుశిక్ష గురించి చంద్రబాబు ‘రాజకీయ ప్రకటనలు’ చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుపై బహిరంగంగా వ్యాఖ్యానించకుండా చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను గత నెలలో విచారించిన అత్యున్నత న్యాయస్థానం, చంద్రబాబు కేసుపై మాట్లాడకుండా బెయిల్‌ షరతును కొనసాగించాలని ఆదేశించింది. న్యాయవాది రంజిత్‌ కుమార్‌ అభ్యర్థనపై స్పందించిన జస్టిస్‌ బోస్‌.. చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రాను ఫైబర్‌నెట్‌ కేసులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున చంద్రబాబు పబ్లిక్‌ డొమైన్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదని నిర్ధారించాలని అన్నారు. చంద్రబాబుపై క్రిమినల్‌ కేసుల గురించి ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ చేసిన ఆరోపణలను లూథ్రా ఎత్తిచూపారు. ‘రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి చాలా చెప్పాలి. ఎఎజి ఈ కేసు గురించి ప్రకటనలు చేయడమే కాకుండా, హైదరాబాద్‌, ఢిల్లీలో విలేకరుల సమావేశాలు కూడా నిర్వహించారు’ అని లూథ్రా తెలిపారు. అయితే కోర్టులో ఉద్రిక్తతలు పెరగడం ప్రారంభించినందున, జస్టిస్‌ బోస్‌ జోక్యం చేసుకుని ఫైబర్‌నెట్‌ కేసులో కూడా పెండింగ్‌లో ఉన్న కేసులపై బహిరంగంగా మౌనం వహించమని వారి సంబంధిత క్లయింట్‌లను కోరమని ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులకు చెప్పారు. అయితే జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ధర్మాసనమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో 17 ఏపై తీర్పును అక్టోబరు 17న రిజర్వు చేసింది.

➡️