నేటి నుంచి జగన్‌ ‘మేమంతా సిద్ధం’

Mar 27,2024 08:40 #ap cm jagan, #speech

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుండి ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ యాత్ర ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే ఏప్రిల్‌ 18 వ తేదీ వరకు దాదాపు 21 రోజుల పాటు కొనసాగనుంది. మొత్తం 21 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో రోజుకో పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం తొలి విడత షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఇడుపుల పాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులర్పించిన అనంతరం బుధవారం మధ్యాహ్నాం 1.30 ని.లకు ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు మొత్తం 354 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర కొనసాగనుంది. మార్చి 27వ తేదీన 115 కి.మీ., మార్చి 28వ తేదీన 131.5 కి.మీ, మార్చి 29వ తేదీన 108 కి.మీ. మేర ఈ బస్సు యాత్ర జరగనుంది. విశాఖపట్నం, ఏలూరు, బాపట్ల, అనంతపురం జిల్లాల్లో ఇది వరకే సీఎం జగన్‌ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. దీంతో ఈ బస్సు యాత్రలో ఈ జిల్లాలకు మినహాయింపు ఇచ్చారు.

➡️