ఆనాటి హామీలు ఏమయ్యాయి?

టిడిపి, జనసేన, బిజెపిలకు జగన్‌ ప్రశ్న
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహాదా ఇచ్చిందా?
ప్రొద్దుటూరు ‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్‌
ప్రజాశక్తి-కడప ప్రతినిధి : రాష్ట్ర ప్రజలకు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని టిడిపి,జనసేన, బిజెపిలను వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. వేంపల్లి, వీరపునాయునిపల్లి, యర్రగుంట్ల మండలాల మీదుగా ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరులో భారీ జనసమీకరణతో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో ఆయన మాట్లాడుతూ 2014 నాటి హామీలు ఏ మేరకు అమలయ్యాయో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. ‘ఆ ముగ్గురు మోసాలను,అబద్దాలను నమ్ముకున్నారు’ అని అన్నారు. ఆ పార్టీలే మళ్లీ కూటమిగా వస్తున్నాయని చెప్పారు. ఎన్ని సార్లు అడిగినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు నమ్మించి నట్టేట ముంచేందుకు 45 ఏళ్ల అనుభవం ఉందని దుయ్యబట్టారు. ఎన్నికలు అవగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడంలోనూ, గోబెల్స్‌ ప్రచారంలోనూ, కుటుంబాలను చీల్చడంలోనూ అనుభవం గడించారని విమర్శించారు. ‘నా చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరు చంపారో, ఎవరు చంపించారో, ఆయనను దారుణంగా చంపినట్లు ఒప్పుకుని వ్యక్తికి మద్దతు ఇస్తున్నదెవరో వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రజలందరికీ తెలుసు’ అని జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబుకు కేంద్రంలోని ఒక జాతీయ పార్టీ, రాష్ట్రంలోని జనసేన పార్టీ చాలక మరో జాతీయ పార్టీని కూడా తెచ్చుకున్నారని విమర్శించారు. నా ఇద్దరు చెల్లెళ్లను నాపైకి పంపించడం వెనుక ఎవరు ఉన్నారో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. వైసిపికి మేనిఫెస్టో బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత లాంటిదన్నారు. 2014లో బిజెపి, టిడిపి కూటమి వారి మేనిఫెస్టోను ఎన్నికల తర్వాత వెబ్‌సైట్‌లో కనిపించకుండా చేసిందని వివరించారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్‌పై చంద్రబాబు, దత్తపుత్రుల బృందంతోపాటు ఎల్లోమీడియా తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిందని, చివరికి చంద్రబాబు వదిన, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలి చుట్టాలకు చెందిన కంపెనీ కావడంతో మిన్నకుందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా తమ ప్రభుత్వంపై చంద్రబాబు బృందం, ఎల్లోమీడియా బురద చల్లుతోందన్నారు. గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతో ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకుని జత కట్టడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. 58 నెలల వ్యవధిలో రాష్ట్ర చరిత్రలో ఎవరూ చూడని, ఊహించని విధంగా పాలన సాగించామన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2.30 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఎప్పటికైనా ఫ్యాన్‌ ఇంట్లోనే ఉండాలని, సైకిల్‌ బయటే ఉండాలని, టీ గ్లాస్‌ తాగిన తర్వాత చెత్తబుట్టలో ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపిలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పొరపాటు జరిగితే రాష్ట్రంలో సంక్షేమానికి పాతరేస్తారన్నారు. ఎంపి వైఎస్‌.అవినాష్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

విజయమ్మ ఆశీస్సులు
ఇడుపుల పాయలో వైఎస్‌ ఆర్‌ ఘాట్‌ వద్ద జగన్‌ నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో విజయమ్మ కూడా పాల్గోన్నారు. జగన్‌ తలపెట్టిన యాత్రను విజయవంతం చేయాలని ఆమె ప్రార్ధించారు. అనంతరం జగన్‌కు ఆశీస్సులు అందించారు.

➡️