Polavaram: రిపేర్లకు గ్యారంటీ ఇవ్వలేం

  • ‘పోలవరం’పై నిపుణులతో నిర్మాణరంగ ప్రతినిధులు
  • ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ గ్యాప్‌లో భారీగా బంకమట్టి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు (రిపేర్లు) చేస్తే, వాటికి గ్యారంటీ ఇవ్వలేమని నిర్మాణంలో భాగస్వాములైన వివిధ సంస్థల ప్రతినిధులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసిన విదేశీ నిపుణులు మూడోరోజైన మంగళవారం సాంకేతిక అంశాలపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించారు. మంగళవారం ఆ సంస్థల ప్రతినిధులతోనూ, నిర్మాణ రంగానికి ఇతర నిపుణులతోనూ సమావేశమైనారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు పనులను కొనసాగిం చడానికి వీలైన మార్గాల గురించి చర్చించారు. మరోవైపు ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ గ్యాప్‌-2లో కుడివైపున 12 మీటర్ల లోతులో భారీగా బంకమట్టి ఉండటం, దాని ప్రభావం నిర్మాణంపై ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగింది. అక్కడ ఆ స్థాయిలో బంకమట్టి ఉన్న విషయాన్ని గతంలోనే గుర్తించినప్పటికీ, ఇన్నాళ్లు అధికారులుగానీ, ప్రభుత్వం కానీ బయటపెట్టలేదని చెబుతున్నారు. బంకమట్టి ఉన్న ప్రాంతంలో భారీ నిర్మాణం చేపట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. అయితే, ఆ ప్రాంతంలో డయాఫ్రం వాల్‌ మాత్రమే నిర్మించినందును పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. అయితే, ఇప్పుడు మట్టి నమూనాలను సేకరించి, పూర్తి స్థాయి పరీక్ష కోసం తీసుకెళ్లడం, పరిశీలించి నివేదిక ఇస్తామని చెప్పడం చర్చనీయాంశమైంది. చీఫ్‌ ఇంజనీర్‌ అధ్యక్షతన ఈ సమావేశంలో ప్రతి నిర్మాణ సంస్థ ప్రతినిధి 20 నిమిషాల పాటు తమ అభిప్రాయాలను వివరించారు. కంపెనీల వారీగా ఇచ్చిన నివేదికలు పరిశీలించి అభిప్రాయాలు సేకరించారు. సాంకేతిక వివరాలను పరిశీలించారు.

బంకమట్టితో ఎలా….?
తొలుత పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులు నిర్మాణ స్థితిగతులు, దెబ్బతిన్న ప్రాంతం, కాఫర్‌డ్యామ్‌ల వివరాలు, స్పిల్‌వే నిర్మాణ జరిగిన సమయం, గ్యాపొచ్చిన వివరాలనూ వెల్లడించారు. అనంతరం సిడబ్ల్యుసి ప్రతినిధులు 2020, 2022లో వరదలు వచ్చిన సమయంలో జరిగిన పరిణామాలను వివరించారు. ఇందులో కాఫర్‌డ్యామ్‌ గ్యాప్‌లలో నుండి తీవ్ర ఒత్తిడితో నీరు ప్రవహించడం దానికి ఎదురుగా డయాఫ్రం వాల్‌ ముందు 50 అడుగుల లోతులో గుంతలు పడటం వంటి విషయాలను తెలిపారు. అనంతరం సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ప్రతినిధులు ఇచ్చిన నివేదికలో ఇసిఆర్‌ఎఫ్‌ గ్యాప్‌-2లో 12 మీటర్ల అడుగుభాగంలో బంకమట్టిని గుర్తించినట్లు తెలిపారు. కొత్తగా డయాఫ్రం వాల్‌ నిర్మించాలంటే ఇప్పుడు ఆ మట్టే కొంత ప్రతికూలంగా మారనుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.బంకమట్టి డయాఫ్రం వాల్‌ మెయిన్‌కోర్సులో ఉందని, గతంలో వేసిన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి ఇది ఇబ్బంది కాదని, కొత్తగా నిర్మించాలంటే మాత్రం సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని చెప్పినట్లు సమాచారం. కెల్లర్‌ సంస్థ ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంకమట్టి ఉండటం వల్ల కొత్తగా నిర్మించబోయే వాటి నాణ్యతపై స్పష్టత రావడం లేదని వివరించినట్లు తెలిసింది.

రిపేర్లకు గ్యారంటీ ఇవ్వలేం…
వ్యాప్కోస్‌ ప్రతినిధులు నీటి ఒత్తిడి తీవ్రతపై రూపొందించిన అంశాలను నిపుణులకు అందజేశారు. నీటి సామర్థ్యం, ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండే ప్రాంతం దానివల్ల ఏర్పడే ఒత్తిడిని ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు ఎంత మేరకు తట్టుకుంటాయనే వివరాలతో నివేదికను సమర్పించారు. ప్రసుత్తం రిపేర్లు, జాయింట్ల పద్ధతిలో నిర్మాణాలు చేపడితే భవిష్యత్‌లో ప్రాజెక్టుపై పడే ఒత్తిడిపై స్పష్టమైన వివరాలు ఇవ్వలేమని చెప్పినట్లు తెలిసింది. బావర్‌ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌ నిర్మాణం దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్‌బండ్‌ కట్టొచ్చని, అది నీటి ఒత్తిడిని ఎంతవరకు తట్టుకుంటుందనే అంశంపై స్పష్టమైన గ్యారంటీ ఇవ్వలేమని పేర్కొన్నారు. మొత్తంగా కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మించడమే మార్గమనీ సూచించారు. దీనికి గ్యారంటీ ఉంటుందా ? ఎంత కాలంలో నిర్మించవచ్చో చెప్పాలని నిపుణులు ప్రశ్నించగా కొత్తగోడకు గ్యారంటీ ఇవ్వవచ్చని, అయితే నాలుగేళ్లా, ఐదేళ్లా అనేది చెప్పలేమని అన్నట్లు సమాచార, కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి ఇండియన్‌ కరెన్సీలో రూ.950 కోట్ల వరకూ అవ్వొచ్చనీ చెప్పినట్లు తెలిసింది. దీనిపై పూర్తి నివేదిక ఇస్తే ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పగా రింగ్‌బండ్‌, కొత్తవాల్‌ నిర్మాణానికి సంబంధించిన నివేదికలనూ సమర్పించారు. కెల్లర్‌ ప్రతినిధులు కూడా వారు రూపొందించిన అంశాలనూ నిపుణులకు వివరించారు. చివరిగా మేఘా కంపెనీ ప్రతినిధుల అభిప్రాయాన్ని తీసుకున్నారు. కొత్త డయాఫ్రంవాల్‌ను నిర్మించడం ద్వారా కొంత వరకూ గ్యారంటీ ఇవ్వవచ్చని, మిగిలిన అంశాలపై స్పష్టత ఇవ్వలేమని వారు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో అమెరికాకు చెందిన నిపుణులు డేవిడ్‌పాల్‌, జియన్‌ ఫ్రాంకో డిసీకో, కెనడాకు చెందిన రిచర్డ్‌ డోనేల్లీ, హిన్ష్‌బర్గర్లు పోలవరం ప్రాజెక్టు సిఇ నరసింహమూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ నిపుణులతోపాటు సిడబ్ల్యుసి డిప్యూటీ డైరెక్టర్‌ అశ్విన్‌కుమార్‌, ప్రాజెక్టు గౌరవ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఇఎన్‌సి నారాయణరెడ్డి, ప్రాజెక్టు ఇఇ మల్లికార్జునరావు, బావర్‌, కెల్లర్‌, ఆఫ్రే, హైదరాబాద్‌ ఐఐటి నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

➡️