‘సూర్య’ ప్రతాపం

Apr 6,2024 07:46 #burning sun!
  • రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
  •  నేడు 388 మండలాల్లో వడగాడ్పులు

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుని ప్రకోపానికి రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్‌ మొదటివారం కూడా పూర్తి కాకముందే చాలా జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. ఈ వేడి తీవ్రతకు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 253 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శనివారం కూడా దాదాపు 388 మండలాల్లో ఈ వడగాడ్పుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శుక్రవారం నంద్యాలలో గరిష్టంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 43.5, జంగమేశ్వరపురంలో 43, అనంతపురంలో 43, కడపలో 42.8, తునిలో 40.4, ఆరోగ్యవరంలో 40, విజయవాడ, అమరావతిలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాబోయే 48 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలోని 26 మండలాలు, విజయనగరంలో 25, అనకాపల్లిలో 16, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 9 మండలాల్లో, కాకినాడలో 13, అంబేద్కర్‌ కోనసీమలో 7, తూర్పుగోదావరిలో 16, ఏలూరులో 4, కృష్ణాలో 4, ఎన్‌టిఆర్‌లో 6, గుంటూరులో 14, పల్నాడు జిల్లాలోని 17 మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
మరో మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం
రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మూడు నుంచి నాలుగు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. విజయనగరం జిల్లా బొబ్బిలి, తెర్లాం, మన్యం జిల్లా పార్వతీపురం, పాలకొండ, సీతంపేట మండలాల్లో 46 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయి. దాచేపల్లి, బెల్లంకొండ, మాచవరం, చందర్లపాడు తదితర మండలాల్లో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

➡️