నాగార్జునసాగర్‌ డ్యాంపై ఉద్రిక్తత

Dec 1,2023 08:41 #Nagarjuna Sagar dam, #tension

– పోలీస్‌ బందోబస్తు మధ్య కుడి కాలువకు నీటి విడుదల

-పోలీస్‌ బందోబస్తులో ఆంధ్రా ప్రాంతంలోని ప్రాజెక్టు పరిసరాలు

ప్రజాశక్తి – మాచర్ల, విజయపురిసౌత్‌నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుంటూరు, నర్సరావుపేట నుంచి పోలీసు బలగాలు నాగార్జునసాగర్‌ చేరుకున్నాయి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోని రిజర్వ్‌ పోలీసుల బందోబస్తులో ఉంటుంది. ప్రాజెక్టు ప్రధాన రహదారి గేటు వద్దకు చేరుకున్న ఆంధ్ర పోలీసులు గేటు తాళాలను పగలగొట్టుకుని లోపలికి వెళ్లి సెక్యూరిటీ కెమెరాలను ధ్వంసం చేసి ప్రాజెక్టు పైకి వెళ్లారు. అక్కడున్న తెలంగాణ సెక్యూరిటీ పోలీసులు వీరితో వాగ్వాదం పెట్టుకున్న బలవంతంగా నెట్టుకుంటూ వెళ్లిపోయారు. 13వ గేటు వరకు దూసుకువచ్చారు. 13వ గేటు వరకు చేరుకున్న ఆంధ్ర పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ముళ్లకంచెను ఏర్పాటు చేసి డ్యామ్‌ను ఆంధ్ర పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అటువైపు నుండి ఇటువైపు వచ్చే వాహనాలు తనిఖీ చేసి ఆంధ్ర ప్రాంతం వారికి మాత్రమే అనుమతిచ్చారు. గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆంధ్ర ఇరిగేషన్‌ శాఖ అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కఅష్ణా నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీటిని విడుదల చేసే క్రస్ట్‌ గేట్ల మెయింటెనెన్స్‌తో పాటు కుడికాలువ గేట్ల మెయింటెనెన్స్‌ కూడా తెలంగాణ వైపు భూభాగంలో ఉన్న ఇరిగేషన్‌ శాఖ అధికారుల ఆధీనంలోనే ఉంటాయి. ఆంధ్ర ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఆ వ్యవస్థను ధ్వంసం చేసి కుడి కాలువకు నీటి విడుదల చేసేందుకు అనువుగా సిస్టంను ఏర్పాటు చేసుకొని గురువారం ఉదయం 10 గంటల సమయంలో కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలోని చెరువులకు గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌ శాఖ అధికారులు చెప్తున్నారు. మొదటగా 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం 3,000 క్యూసెక్కుల వరకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు అయిదు టిఎంసిల నీటిని తాగునీటి అవసరాల కోసం తీసుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతం నీటి వాటాను ఇప్పటికే వాడుకున్నదని కాబట్టి నీటిని విడుదల చేయము అని తెలంగాణ అధికారులు అంటున్నారని, మన వాటా నీళ్ళు ఇంకా ఉన్నాయని అందువలన తాగునీటి అవసరాల కోసం బలవంతంగా నీటి విడుదల చేసుకోవాల్సి వచ్చిందన్నారు..

➡️