గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా టెలికం సేవలు300 టవర్లు ప్రారంభించిన సిఎం

Jan 25,2024 21:55 #ap cm jagan, #opened, #telecom towers

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మారుమూల గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన టెలికం సేవలను విస్తృతంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన 300 టవర్లను గురువారం క్యాంపు కార్యాలయం నుండి సిఎం బటన్‌నొక్కి ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ గతంలో వంద టవర్లు ప్రారంభించామని, కొత్తగా 300 టవర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటిల్లో ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో నాలుగు, ఏలూరులో మూడు, శ్రీకాకుళంలో రెండు, కాకినాడ జిల్లాలో ఒక టవర్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సుమారు రూ.400 కోట్ల ఖర్చుతో వీటిని నిర్మించామని, దీనివల్ల 944 గ్రామాల్లో రెండు లక్షలమందికి సేవలు అందుతాయని పేర్కొన్నారు. మొత్తం 2,900 టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికి రూ.3,119 కోట్లు ఖర్చవుతాయని వివరించారు. 2,900 ప్రాంతాల్లో స్థలాలు కూడా ఆయా కంపెనీలకు ఇచ్చామని పేర్కొన్నారు. వీటితో గ్రామ సచివాలయాలు, ఆర్‌బికె, విలేజ్‌ క్లినిక్‌లు, నాడు నేడు కింద ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో సేవలు అందుతాయని పేర్కొన్నారు. వీటితో గ్రామాల రూపురేఖలు మారుతాయని వివరించారు.

➡️