విభజన హామీల సాధన కోసంమలిదశ ఉద్యమం తీవ్రం

Jan 12,2024 08:12 #ap special status, #press meet

– ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రత్యేక హోదా విభజన హామీల సాధన భావితరాలకు అవసరమని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నాయకులు తెలిపారు. దీనికోసం మలిదశ ఉద్యమాన్ని తీవ్రం చేయనున్నామని ప్రకటించారు. గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సాధన సమితి విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాయితీలు ఇచ్చే వరకూ పోరాడుతూనే ఉంటామని తెలిపారు. పోరాటాల ద్వారానే కొన్ని హామీలు అయినా వచ్చాయని, గత నెలలో దీనిపై ఢిల్లీలో ఆందోళన చేశామని, ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని ప్రకటించారు. జిల్లాస్థాయి నుంచి మండల స్థాయి వరకూ నిరాహార దీక్షలు ఉంటాయని, అన్ని పార్టీల నాయకులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. యువత భవిష్యత్‌ను కోరి అందరూ ఉద్యమంలోకి రావాలని కోరారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రత్యేక హోదాను అన్ని పార్టీలూ వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేంత వరకూ పోరాటం సాగుతుందని వివరించారు. రైతు ఉద్యమం తరహాలోనే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమిళనాడులో జల్లికట్టు కోసం జరిగిన ఆందోళన తరహాలో పోరాడితేనే అన్ని రాజకీయ పార్టీలూ రాష్ట్రం వైపు చూస్తాయని వివరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అనేక అంశాలపై నమ్మకం ద్రోహం చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. వైసిపి రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద మోకరిల్లిందని, కేంద్రాన్ని డిమాండ్‌ చేసే సందర్భాలు అనేకసార్లు వచ్చినా అవకాశాన్ని ఉపయోగించుకోలేదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో హోదా, విభజన హామీలు ఒక అజెండా కావాలన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్రంతో కుమ్మక్కవ్వడానికి రాష్ట్ర పార్టీలు పోటీలు పడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ రాష్ట్రానికి హోదా హామీ ఇచ్చిందని, తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోడీ హామీ ఇచ్చి పదేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం, పోతిన వెంకట రామారావు, ఎమ్‌సిపిఐ(యు) నాయకులు ఖాదర్‌ బాషా, ఎఐవైఎఫ్‌ నాయకులు పరుచూరి రాజేంద్ర తదితరులు పాల్గన్నారు.

➡️