Visakha Drug Racket సమగ్ర దర్యాప్తు జరపండి- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్‌ కంటైనర్‌ వ్యవహారంపై ప్రత్యేక బృందం ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. బిజెపి, వైసిపి, టిడిపి నాయకుల పరస్పర ఆరోపణలు చూస్తుంటే ఈ పార్టీల మద్దతుతోనే డ్రగ్స్‌ మాఫియా నడుస్తున్నట్లు అర్థమవుతోందని, ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా మారుస్తామని వారు హామీ ఇవ్వాలని కోరారు. డ్రగ్స్‌ కంటైనర్లు దిగుమతి చేసుకున్న కంపెనీ ఓనర్లతో తమకు సంబంధం ఉందో లేదో ఆ పార్టీ నాయకులే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రొయ్యల మేత పేరుతో డ్రగ్స్‌ దిగుమతి చేయడం చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం అండ లేకుండా సాధ్యం కాదని, వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్‌పోల్‌ నుండి 18వ తేదీన సమాచారం వచ్చినా నాలుగు రోజులు ఎందుకు ఆలస్యం చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ పట్టుబడినా రాష్ట్రంలోనే మూలాలు కనబడుతున్నాయని, గతంలో గుజరాత్‌ రాష్ట్రం ముంద్రా పోర్టులో పట్టుబడిన వేల కోట్ల విలువైన హెరాయిన్‌ విజయవాడ చిరునామాతోనే ఆఫ్ఘనిస్తాన్‌ నుండి వచ్చిందని గుర్తు చేశారు. గంజాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారిపోతోందని, డ్రగ్స్‌ మత్తులో యువత చిత్తు అవుతోందని, ఎన్నికల సమయంలో వేల కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. కంటైనర్‌ను దిగుమతి చేసుకున్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్స్ట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్‌ దిగుమతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

విశాఖలో ఆపరేషన్‌ గరుడ

➡️