‘ఉక్కు’లో ఉద్యోగుల ఏరివేత! 

visakha-steel-plant jobs cut by govt
  • 25 శాతం మంది ఉద్వాసనకు చర్యలు ప్రారంభం
  •  ఏళ్ల తరబడి ఖాళీల భర్తీకి బ్రేక్‌

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతోన్న నేపథ్యంలో వెయ్యి రోజులకుపైగా కార్మికులు, ఉద్యోగులు పోరాడుతున్నా కేంద్రంలోని మోడీ సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు. మరోవైపు ప్రయివేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందని, తాను అమిత్‌ షాతో ఢిల్లీలో మాట్లాడానని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రచారం పటాపంచలయ్యేలా తాజాగా ప్లాంట్‌లో పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జిందాల్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ… వైజాగ్‌ స్టీల్‌ యాజమాన్యానికి 25 శాతం ఉద్యోగులు, కార్మికుల ఏరివేతకు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తుతం ప్లాంట్‌ యాజమాన్యం అమలులో పెట్టింది. గతంలో బాగా పనిచేసి ప్రస్తుతం అనారోగ్యం పాలైన సుమారు 700 మంది ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసుకుని వీరందరికీ మెడికల్‌ టెస్టులు నిర్వహించబోతోంది. లాంగ్‌ లీవ్‌లు, సిక్‌లీవ్‌లు, ఇతర కారణాలతో సెలవులో ఉన్న వారిని కూడా కలుపుకుంటే మరో 750 మంది ఉన్నట్లు భోగట్టా. 2024 జనవరి నుంచి డిసెంబరులోపు 1100 మంది ఉద్యోగులు రిటైర్‌ కానున్నారు. ఉన్నవారిని బయటకు నెట్టే ప్రక్రియ ఒకవైపు, ఐదు వేల ఖాళీ పోస్టులను భర్తీ జరగకుండా చూడడం మరోవైపు ప్లాంట్‌లో సాగుతోంది. ఉక్కు ఫ్యాక్టరీకి ఆర్థిక భారం తగ్గించే పేరుతో ఈ తతంగం నడుపుతున్నారు. ఢిల్లీలో జిందాల్‌ ప్రతినిధులు, స్టీల్‌ యాజమాన్యం మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా పలు విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఖాళీ పోస్టులు భర్తీ జరిగితేనే కొత్తగా యువతకు ఉద్యోగాలు సాధ్యమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె.అయోధ్యరాం శనివారం ‘ప్రజాశక్తి’కి తెలిపారు. ఉద్యోగాల భర్తీ కోసం సిఐటియు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పోరాడుతోందని చెప్పారు.

  • బళ్లారి మోడల్‌తో కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్షన్‌

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ జిందాల్‌కు చెందిన బళ్లారి ప్రయివేట్‌ స్టీల్‌ ప్లాంట్‌ను అనుసరిస్తూ (మ్యాన్‌ పవర్‌ తగ్గిస్తూ) వెళ్లాలని ఢిల్లీలో జరిగిన ఒప్పందం చెబుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించాలంటే, పర్మినెంట్‌ కార్మికులను తగ్గించి కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను పెంచి నడపాలన్నదే దీని సారాంశం. వైజాగ్‌ స్టీల్‌లో జిందాల్‌ ఎంట్రీ వెనుక కుట్ర కూడా ఇదేనని ప్రచారం జరుగుతోంది. బళ్లారి జిందాల్‌ స్టీల్‌లో నాలుగు వేల మంది పర్మినెంట్‌, ఆరు వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. 16 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి వస్తోంది. విశాఖలో 16 వేల మంది కాంట్రాక్టు కార్మికులు, 13,500 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతోందన్న పోలికలతో కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ వైజాగ్‌ స్టీల్‌ యాజమాన్యంపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దీంతో, పర్మినెంట్‌ కార్మికులను బయటకునెట్టే చర్యలు తాజాగా ఊపందుకున్నాయి.

  • కష్టకాలంలోనూ రూ.1,700 కోట్ల టర్నోవర్‌

2023లో పది నెలల కష్టకాలంలో కూడా అంటే, ప్లాంట్‌లోని మూడు ఫర్నేస్‌ల్లో ఒకదాన్ని నిలిపేసినా రూ.1,700 కోట్లు టర్నోవర్‌ను ఉక్కు కర్మాగారం సాధించి రికార్డు నెలకొల్పింది. చలికాలమైన డిసెంబరు, జనవరిల్లో నిర్మాణ రంగం ఊపులో ఉంటుంది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో ఉత్పత్తి మరో రూ.1000 కోట్లు అదనంగా స్టీల్‌ ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్లుగా కేంద్రం మూసేసిన మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను స్టీల్‌ కార్మికుల దీర్ఘకాల ఆందోళనలతో తాజాగా పనిచేయిస్తున్నారు. అదనపు ఉత్పత్తి దీని ద్వారా సాధ్యపడనుంది. ఉద్యోగాలను తొలగించాల్సిన అవసరం రాకపోయినా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ జిందాల్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

➡️