49 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 103 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు

భోపాల్‌ : 103 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు, 49 ఏళ్ల మహిళను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అతనెవరంటే..? భోపాల్‌లోని ఇత్వారా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు హబీబ్‌ నాజర్‌ (103).. ఫిరోజ్‌ జహాన్‌ (49) అనే మహిళను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇటీవలే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వృద్ధుడికిది మూడో వివాహం కావడం విశేషం. తన రెండో భార్య మరణించిన తర్వాత ఒంటరితనం భరించలేకే తాను మూడో పెళ్లి చేసుకున్నట్లు నాజర్‌ చెప్పారు. కాగా, హబీబ్‌ నాజర్‌ తొలి వివాహం మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. మొదటి భార్య మరణించడంతో ఉత్తరప్రదేశ్‌ లక్నోలో రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడో వివాహం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 49 ఏళ్ల ఫిరోజ్‌కి ఇది రెండో పెళ్లి. భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఎవరి బలవంతం లేకుండానే నాజర్‌ని పెళ్లి చేసుకున్నానని ఫిరోజ్‌ మీడియాకు చెప్పింది.

➡️