ఎఫ్‌డిఐల తిరోగమనం

Jan 16,2024 20:19 #Business, #fdi, #Sitaram Yechury
  • గతేడాది భారీగా పతనం
  • భారత్‌పై విదేశీ ఇన్వెస్టర్ల అనాసక్తి

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని.. భారత జిడిపి వృద్థి మెరుగ్గా ఉందని బిజెపి ప్రభుత్వ వర్గాలు చేస్తోన్న ప్రచారానికి.. వాస్తవ గణంకాలు భిన్నంగా ఉన్నాయి. ఇందుకు గతేడాది వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డిఐ) పతనమే నిదర్శనం. 2023 సెప్టెంబర్‌ ముగింపు నాటికి భారత్‌లోకి కేవలం 13 బిలియన్‌ డాలర్ల నికర ఎఫ్‌డిఐలు వచ్చాయని హెచ్‌ఎస్‌బిసి హోల్డింగ్స్‌ వెల్లడించినట్లు బ్లూమ్‌బర్గ్‌ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ఇంతఇకతం ఏడాది ఇదే కాలంలో 38 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 44 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డిఐలు నమోదయ్యాయి. దీంతో ఏడాదికేడాదితో పోల్చితే భారత్‌లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుందని స్పష్టమవుతోంది. గతేడాది వచ్చిన ఎఫ్‌డిఐ ప్రకటనల్లో అమెరికన్‌ సంస్థల సెమీకండక్టర్‌ ప్లాంట్ల నుండి గల్ఫ్‌ దేశాల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వరకు ప్రాజెక్టులు ఉన్నాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థం (హెచ్‌1)లో 4.8 బిలియన్‌ డాలర్ల నికర ఎఫ్‌డిఐలు మాత్రమే వచ్చాయి. ఇంతక్రితం ఏడాది ఇదే హెచ్‌1లో ఏకంగా 19.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఓ వైపు భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్థిని సాధిస్తుందని ప్రభుత్వ గణంకాలు చెబుతుంటే.. మరోవైపు ఎఫ్‌డిఐల్లో తిరోగమనం గందరగోళంగా ఉందని హెచ్‌ఎస్‌బిసి తెలిపింది. 2024 మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 7.3 శాతం పెరగొచ్చని ప్రభుత్వ అంచనాలు ఉండగా.. విదేశీ పెట్టుబడుల్లో పతనం చోటు చేసుకోవడం గమనార్హం. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. భారతీయ టెక్‌ స్టార్టప్‌లలో పెట్టుబడులు పడిపోవడాన్ని హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్‌ ఆర్థికవేత్తలు గురువారం ఓ నివేదికలో గుర్తు చేశారు. ఆటోమొబైల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌. నిర్మాణ రంగాల్లోనూ పెట్టుబడులు పడిపోవడం గమనార్హం. కాగా.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సెంటర్లు. విద్యుత్‌ వాహనాలు తదితర రంగాల్లో కొంత పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల భారతదేశంలోకి ఎఫ్‌డిఐల తగ్గుదలను గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంగీకరించారు. కాగా.. 2023 డిసెంబర్‌లో కేవలం 2.25 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డిఐలు వచ్చాయని ఆర్‌బిఐ వెల్లడించింది. ఇంతక్రితం ఏడాది ఇదే నెలలో 4.12 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డిఐలు నమోదయ్యాయి. వైబ్రెంట్‌ గుజరాత్‌ సమావేశంలోనూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయంలో భారత్‌ ఎఫ్‌డిఐల ఆకర్షణలో దూసుకుపోతుందన్నారు. దీనికి భిన్నంగా గణంకాలు నమోదు కావడం గమనార్హం.

అంతా కట్టుకథలు : సీతారాం ఏచూరి

”ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయని.. విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రచారానికి వాస్తవ అంశాలకు పొంతన లేకుండా ఉంది. ఇందుకు నిదర్శనం గతేడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పడిపోవడమే. భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని అంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు.” అని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్‌ చేశారు.

➡️