టాటా టెక్‌ బంఫర్‌ లిస్టింగ్‌-140 శాతం ప్రీమియంతో ప్రవేశం

Nov 30,2023 21:20 #Business

ముంబయి : టాటా గ్రూపు నుంచి దాదాపు 19 ఏళ్ళ తర్వాత లిస్టింగ్‌కు వచ్చిన టాటా టెక్నాలజీస్‌ లిస్టింగ్‌ తొలి రోజే అదరగొట్టింది. గురువారం ఉదయం 140 శాతం ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. తుదకు 165 శాతం లాభంతో రూ.1,325 వద్ద ముగిసింది. టాటా టెక్నాలజీ ఇష్యూ ధర రూ.500గా నిర్ణయించింది. లిస్టింగ్‌కు వచ్చిన తొలి రోజే రూ.1,200 వద్ద ప్రారంభమయ్యింది. దీంతో ఒక్కో షేరుపై లిస్టింగ్‌లోనే ఇన్వెస్టర్లకు రూ.700 రాబడిని ఇచ్చింది. ఇష్యూలో షేర్లు దక్కిన వారు 30 షేర్లు కలిగిన ఒక్కో లాట్‌పై రూ.21వేల లాభాన్ని పొందారు. ఒక్క లాట్‌ కోసం రూ.15వేలు పెట్టుబడి పెట్టారు. దీంతో లిస్టింగ్‌ రోజున అత్యధిక రాబడులు ఇచ్చిన సంస్థల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ఈ ఇష్యూలో ద్వారా రూ.3042.5 కోట్లు సమీకరించాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా రూ.1.5 లక్షల కోట్ల విలువ చేసే బిడ్డింగ్‌లు రావడం విశేషం. టాటా మోటార్స్‌కు చెందిన టాటా టెక్నాలజీస్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సర్వీసెస్‌ సంస్థ, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ సహా టాటా గ్రూప్‌లోని పలు సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఈ ఐపిఒలో భాగంగా టాటా మోటార్స్‌ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించింది.

➡️