త్వరలో పసిడి బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌

Feb 6,2024 21:10 #Business

ముంబయి: బంగారంలో మదుపు చేయాలనుకునే వారి కోసం కేంద్రం తీసుకొచ్చిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ త్వరలో ప్రారంభం కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సబ్‌స్క్రిప్షన్‌ ఫిబ్రవరి 12న ప్రారంభమై.. 16 వరకూ అందుబాటులో ఉంటుంది. బంగారం ధరను త్వరలో ఆర్‌బీఐ ఖరారు చేయనుంది. సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధర ఆధారంగా గ్రాము రేటును ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. కనీసం 1 గ్రాము ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ కొనుగోలుపై రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది.పేటీఎంకు ఏమైంది?సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను నివాసితులు, ట్రస్ట్‌లు, హెచ్‌యుఎఫ్‌లు, స్వచ్ఛంద సంస్థలు కొనుగోలు చేయెచ్చు. మైనర్ల తరపున ఒక వ్యక్తి లేదా ఇతర వ్యక్తులతో జాయింట్‌గా కూడా కొనొచ్చు. బాండ్‌ నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50 శాతం ఫిక్స్‌డ్‌ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. బాండ్ల కాలవ్యవధి ఎనిమిదేళ్లు. బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే మూలధన లాభాలపై ఎస్‌బిజి పన్ను మినహాయింపును అందిస్తుంది. మూడేళ్ల ముందు బాండ్లను విక్రయిస్తే.. స్వల్పకాలిక మూలధన లాభాల కింద వచ్చే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్‌ బాండ్లను పరిశీలించొచ్చు.

ఆన్‌లైన్‌లో కొనుగోలు ఎలా?

మీ నెట్‌బ్యాంకింగ్‌కు (ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌) లాగిన్‌ అవ్వండి. మెనూలో ఈ సర్వీసెస్‌/ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సెక్షన్‌లో ‘సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌’ ఆప్షన్‌ ఎంచుకోండి. (స్కీమ్‌ అందుబాటులో ఉన్నప్పుడు ఈ విండో తెరుచుకుంటుంది) టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ చదివి తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయండి. సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌కు అవరమైన వివరాలు ఇచ్చి డిపాజటరీ పార్టిసిపేట్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌ లేదా సీడీఎస్‌ఎల్‌)ను ఎంచుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్‌ ఫారాన్ని సమర్పించండి. రిజిస్ట్రేషన్‌ తర్వాత పర్చేజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు, నామినీ వివరాలు ఇవ్వాలి. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది.

➡️