ఇపిఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ

Feb 11,2024 08:25 #Business

2023-24కు గాను సిబిటి నిర్ణయం

న్యూఢిల్లీ : ఉద్యోగ, కార్మికులకు చెందిన ప్రావిడెంట్‌ ఫండ్‌పై 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25 వడ్డీ చెల్లించనున్నారు. దీనిపై శనివారం జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సిబిటి)లో నిర్ణయం తీసుకున్నట్లు ఇపిఎఫ్‌ఒ వర్గాలు తెలిపాయి. ఇపిఎఫ్‌ఒ సిబిటి సమావేశానికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షత వహించారు. సిబిటి ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు లభించాల్సి ఉంది. ప్రభుత్వం ఆమోదం తర్వాత అధికారికంగా నోటీఫై చేస్తారు. అనంతరం వడ్డీ మొత్తాన్ని చందాదారుల ఖాతాల్లో జమ చేస్తారు. కాగా.. గత ఆర్థిక సంవత్సరం ప్రావిడెంట్‌ ఫండ్‌పై 2022-23లో 8.15 శాతం వడ్డీ చెల్లించారు. దీంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వడ్డీ చెల్లింపుల్లో స్వల్ప పెరుగుదల ఉంది. 2018-19లో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటుకు మోడీ ప్రభుత్వం క్రమంగా కోత పెట్టింది. 2021-22లో ఏకంగా 8.1 శాతానికి కోత పెట్టి.. నాలుగు దశాబ్దాల కనిష్టానికి తగ్గించారు. తిరిగి గడిచిన 2022-23లో 8.15 శాతం వడ్డీ రేటు అందించారు. ఇపిఎఫ్‌లో దాదాపు 6 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇపిఎఫ్‌పై వడ్డీని 8 శాతానికే పరిమితం చేస్తారని తొలుత రిపోర్టులు వచ్చినప్పటికీ.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తే నష్టపోతామనే ఉద్దేశ్యంతో బిజెపి ప్రభుత్వం అంచనాల కంటే స్వల్పంగా పెంచి ఇవ్వడానికి ఆసక్తి చూపిందని తెలుస్తోంది.

➡️