నైపుణ్య ఉద్యోగ నియామకాల్లో క్షీణత

Jan 10,2024 08:27 #Business

డిసెంబర్‌లో 16 శాతం పతనం

ఐటి, ఇతర రంగాల్లో ప్రతికూలత

ముంబయి : దేశంలో నైపుణ్యవంతుల నిరుద్యోగం పెరుగుతోంది. ఓ వైపున ఉన్న ఉద్యోగాలు ఊడుతుండగా.. మరోవైపు కొత్త నియామకాలు పడిపోతున్నాయి. ఐటి, బిపిఒ, విద్యా, రిటైల్‌, వైద్య తదితర రంగాల్లో ఉద్యోగాల సృష్టిలో మందగమనం చోటు చేసుకుంటుంది. ఏడాదికేడాదితో పోల్చితే 2023 డిసెంబర్‌లో నైపుణ్యవంతుల ఉద్యోగ (వైట్‌ కాలర్‌) నియామకాల్లో ఏకంగా 16 శాతం క్షీణత చోటు చేసుకుందని నౌక్రీ.కమ్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్‌ గోయల్‌ వెల్లడించారు. నైపుణ్యం (స్కిల్డ్‌), అధిక వేతనాలు, కార్యాలయాల్లో పని చేసే వారిని వైట్‌ కాలర్‌ ఉద్యోగులుగా భావిస్తారు. నౌక్రి జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ను పవన్‌ గోయల్‌ విశ్లేషిస్తూ.. ”గతేడాది నవంబర్‌తో పోల్చితే నియామక కార్యకలపాలు డిసెంబర్‌లో 2 శాతం పెరిగినప్పటికీ.. ఇది కూడా ఐటియేతర రంగాల నుంచి నమోదయ్యింది. 2022 డిసెంబర్‌తో పోల్చితే గడిచిన నెలలో నియామకాలు 16 శాతం క్షీణించాయి. ఐటి నియామకాల్లో పూర్తి రికవరీ కోసం దీర్ఘకాలం వేచి చూడాల్సిందే.” అని అన్నారు. ”బిపిఒ, విద్యా, రిటైల్‌, వైద్యం వంటి రంగాల్లో నియామక విశ్వాసాలు తగ్గాయి. ఆయా రంగాల్లో రిక్రూట్‌మెంట్స్‌ వరుసగా 17 శాతం, 11 శాతం, 11 శాతం, 10 శాతం క్షీణతను చవిచూశాయి. ఐటి రంగం నియామకాల్లో ఏకంగా 21 శాతం పతనం చోటు చేసుకుంది. కాగా.. స్టాక్‌ డేటా సైంటిస్ట, ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీర్‌, ఆటోమేషన్‌ ఇంజనీర్‌ తదితర విభాగాల్లో ఆశాజనక నియామకాలు జరిగాయి. చమురు, గ్యాస్‌ రంగంలో పెద్దగా కొత్త ఉద్యోగాల సృష్టి చోటు చేసుకోనప్పటికీ.. 2022 నాటి స్థాయిలో ప్రతిబింబించాయి. పర్యాటకం, హోటల్‌ రంగంలో మాత్రం 4 శాతం వృద్థి చోటు చేసుకుంది. ఫార్మా రంగం రిక్రూట్‌మెంట్‌లో 2 శాతం పెరుగుదల ఉంది. గడిచిన డిసెంబర్‌లో మెట్రో నగరాలతో పోల్చితే మెట్రోయేతర నగరాల్లో ఎక్కువ నియామకాలు జరిగాయి. చెన్నరు, బెంగళూరు, హైదరాబాద్‌, పూణె, కోత్‌కతా నగరాల్లో వరుసగా 24 శాతం, 23 శాతం, 23 శాతం, 17 శాతం, 16 శాతం చొప్పున నియామాకాల్లో క్షీణత చోటు చేసుకుంది.” అని నౌక్రీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ వెల్లడించింది.

➡️