దేనినైనా హ్యాక్‌ చేయొచ్చు

Jun 16,2024 23:35 #elon musk, #EVM controversy

ఇవిఎంల వివాదంలో ఎలాన్‌ మస్క్‌
అంగీకరించిన ఐటీ మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌
భారత ఇవిఎంలు బ్లాక్‌ బాక్స్‌లు : రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ: భారత ఇవిఎంలు సురక్షితమైనవని, విభిన్నమైనవని బిజెపి నాయకుడు, కేంద్ర ఐటి శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలను టెక్‌ దిగ్గజం, టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ ఖండించారు. దేనినైనా హ్యాక్‌ చేయవచ్చునని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై చంద్రశేఖర్‌ స్పందిస్తూ… ”సాంకేతికంగా మీరు కరెక్టే. ఏదైనా సాధ్యమే. ఉదాహరణకు క్యాంటం కంప్యూటర్‌ ఏ స్థాయి ఎన్‌క్రిప్షన్‌ను అయినా నేను డీక్రిప్ట్‌ చేయగలను. జెట్‌ యొక్క విమాన నియంత్రణలోని గ్లాస్‌ కాప్‌పిట్‌తో సహా డిజిటల్‌ హార్ట్‌వేర్‌, సిస్టమ్‌ను నేను ల్యాబ్‌ లెవల్‌ టెక్‌, వనరులతో హ్యాక్‌ చేయగలను. కానీ, విభిన్నమైన కన్వర్‌జేషన్‌ ఉండటం వలన ఇవిఎంలు సురక్షితమైనవని నేను చెబుతున్నాను. మీ వాదనతో నేను విభేదిస్తున్నాను’ అని మంత్రి అన్నారు.
ఇవిఎంల గురించి గత మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్యూర్టో రికో ప్రైమరీ ఎన్నికల్లో ఇవిఎంలకు సంబంధించిన ఓటింగ్‌ అవకతవకలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్‌ కెన్నడీ జూనియర్‌ చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ ‘ఇవిఎంలను తొలగించాలి’ అని మస్క్‌ ఎక్స్‌లో పోస్టు చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ‘ఇవిఎంలను మానవులు, ఎఐలు హ్యక్‌ చేసే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం చిన్నదే అయినా.. ఎక్కువ ప్రభావం చూపుతుంది’ అని మస్క్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. మస్క్‌ పోస్టుకు స్పందిస్తూ మస్క్‌ అభిప్రాయం ఇంటర్నెట్‌తో అనుసంధానం ఉన్న ఇవిఎంలు ఉపయోగించే అమెరికా, ఇతర ప్రాంతాలకు వర్తిస్తుందని మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పోస్టు చేశారు. భారత ఇవిఎంలు సురక్షితమైనవి, విభిన్నంగా డిజైన్‌ చేసినవి అని చెప్పారు.
భారత ఇవిఎంలు బ్లాక్‌ బాక్స్‌లు : రాహుల్‌ గాంధీ
భారత ఇవిఎంలు ‘బ్లాక్‌ బాక్స్‌’ వంటివని, వీటిని ఎవరూ పరిశీలించడానికి అనుమతించరని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. భారత ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘సంస్థల్లో బాధ్యతాయుత విధానం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసంగా మారుతుంది’ అని అన్నారు. ఇవిఎంల వివాదంపై భారత ఎన్నికల సంఘం ఇంకా స్పందించలేదు.

➡️