ద్రవ్యోల్బణంతో వంటిల్లుపై భారం..!

May 14,2024 09:25 #Business
  • శాఖహార భోజనం ప్రియం
  • రేటింగ్‌ ఎజెన్సీ క్రిసిల్‌ వెల్లడి

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతుండటంతో వంటిల్లుపై భారం పడుతుంది. భోజన వ్యయం పెరిగినట్లు ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ డేటాను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుటుంబాల శాఖాహార భోజనం వ్యయం 8 శాతం పెరిగి రూ.27.4కు చేరింది. గతేడాది ఇదే నెలలో ప్లేట్‌ వ్యయం రూ.25.4గా ఉందని క్రిసిల్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది. మరోవైపు మాంసహారం భోజనం రేటు 4 శాతం తగ్గిందని తెలిపింది. కాగా.. ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంపలతో పాటు కూరగాయలు, పప్పుల ధరలు ఎగిసి పడటంతో శాఖహార భోజనం ఖర్చు పెరిగిందని తెలిపింది. చికెన్‌ ధరలు తగ్గడంతో నాన్‌వెజ్‌ భోజనం ఖర్చు తగ్గిందని పేర్కొంది. శాఖహారంలో రోటీ, ఉల్లిపాయ, టమాటో, బంగాళదుంప, అన్నం, పప్పు, పెరుగు, సలాడ్‌ ఉండగా.. మంసాహారం భోజనంలో ఇవే పదార్థాలుంటాయి. కేవలం పప్పు స్థానంలో మాంసం, గుడ్లను చేర్చి.. లెక్కిస్తుంది. ఇందులో నూనెలు, వంటగ్యాస్‌, మసాలాల వ్యయాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన ఏప్రిల్‌లో బియ్యం, పప్పుల ధరలు వరుసగా 14 శాతం, 20 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు జీలకర్ర, మిరపకాయలు, వంట నూనెల ధరలు తగ్గాయి. కాగా.. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో మాంసహార ప్లేట్‌ వ్యయం 3 శాతం పెరిగిందని తెలిపింది. సమీప భవిష్యత్తులో కూరగాయల ధరలు మరింత పెరగొచ్చని క్రిసిల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ పుషన్‌ శర్మ పేర్కొన్నారు. 2023 నవంబర్‌ నుంచి శాఖహారం భోజన వ్యయం పెరుగుతుందన్నారు.

➡️