నేటి నుంచి ఇ-ఆఫీస్‌ మూసివేత

May 17,2024 08:22
  •  ఫైళ్ళను మాయం చేసేందుకేనని ఆరోపణలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టులాంటి ఇ-ఆఫీస్‌ను నేటి నుంచి కొద్ది రోజులపాటు మూసివేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, పోలింగ్‌ ప్రక్రియ జరిగి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రస్తుత సమయంలో దీనిని మూసివేయాలని నిర్ణయించడం పట్ల అధికారుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ యైతే ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పుడు నిర్ణయాలకు సంబంధించిన ఫైలును మాయం చేసేందుకే ఇ – ఆఫీసును మూసివేస్తున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సైతం ఇదే అంశాన్ని రాష్ట్ర గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లాడు. చాలాకాలంగా పేపర్‌ వర్క్‌పైనే ఆధారపడిన, పేపర్‌ ఫైళ్లతోనే పాలనను నడిపించిన ప్రభుత్వం తరువాత కాలంలో ఇ-ఆఫీస్‌ ద్వారా పాలనను సాగించింది. కాగితం అన్నది లేకుండానే మొత్తం పాలన సాఫ్ట్‌వేర్‌తోనే నడిపిస్తోంది. దీనివల్ల పాలనలో వేగం కూడా పెరిగింది. అయితే దీనిని అభివృద్ధి పేరిట 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పరిథిలోని ఎన్‌ఐసి సూచనల మేరకే దీనిని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్‌ను ఇకపై 7.ఎక్స్‌ కు మార్పు చేయనున్నట్లు ఇ-ఆఫీస్‌ వెబ్‌సైట్‌లో ప్రకటించడం గమనార్హం. అయితే ఈ చర్య వల్ల ఇ-ఫైళ్లు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయని కొందరు అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ తరహా కార్యక్రమాలు చేపట్టడం మేలన్న అభిప్రాయం వీరిలో వ్యక్తమవుతోంది.

అనుమానాలకు తావిస్తోంది : చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనుమానాలకు తావిస్తోందని చంద్రబాబు ఆరోపిరచారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు సుదీర్ఘ లేఖ రాసారు. ఇప్పటికే అనేక దస్త్రాలు మాయమయ్యాయని, సిఐడి చేతుల్లో ఉన్న పత్రాలను కూడా కాల్చివేశారని లేఖలో పేర్కొన్నారు. వీటిపై ఎన్నికల కమిషన్‌ కూడా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందుకే అన్ని శాఖాధిపతుల కార్యా లయాల్లో సిసి కెమేరాలు ఏర్పాటుచేయాలని, అన్ని ఫైళ్లు భద్రపరిచేలా సిఎస్‌ను ఆదేశించాలని ఆయన కోరారు. ప్రధానంగా 2019 నురచి ఉన్న ఫిజికల్‌, డిజిటల్‌ డాక్కుమెంట్లను భద్రపరిచేలా సిఎస్‌కు ఆదేశాలు జారీ చేయాలని చంద్రబాబు కోరారు.

➡️