భారత సంతతి వ్యాపారులకు జైలు

  • అమెరికాలో వేల కోట్ల మోసం

చికాగో : అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలు వేల కోట్ల మోసం చేయడంతో వారికి అక్కడి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఒకప్పుడు చికాగోలోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్‌ ‘ఔట్‌కమ్‌ హెల్త్‌’ మోసాలకు పాల్పడింది. రిషి షా, శ్రద్ధా అగర్వాల్‌లు 2006లో ఔట్‌కమ్‌ హెల్త్‌ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ డాక్టర్ల వద్ద స్క్రీన్‌లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఔషధ ప్రకటనలు ప్రసారం చేసేవారు. దీనికి అక్కడ దేశ వ్యాప్తంగా కాంట్రాక్టులు లభించాయి. 2010 నుంచి భారీగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. మరోవైపు ‘ఔట్‌కమ్‌ హెల్త్‌’ నిర్వహణ, ఆర్థిక కార్యకలాపాలను పెంచి చూపిస్తున్నట్లు అక్కడి క్లయింట్లు గుర్తించారు. కంపెనీ డెలివరీ చేయగలిగిన స్థాయి కంటే ఎక్కువగా వాణిజ్య ప్రకటనల ఇన్వెంటరీని విక్రయిస్తున్నట్లు తేలింది. ఫార్మా జెయింట్‌ నోవో నార్డ్‌స్క్‌ తదితర సంస్థలు దీన్ని బయటపెట్టాయి. దాదాపు రూ.8300 కోట్ల మోసానికి పాల్పడ్డారు. దీంతో షాపై 2023 ఏప్రిల్‌లో 12పైగా మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. తాను చేసిన పనికి సిగ్గు పడుతున్నట్లు రిషి షా తన నేరం అంగీకారంలో తెలిపారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం షాకు 7 ఏళ్ల ఆరు నెలలు, శ్రద్ధాకు మూడేళ్ల హాఫ్‌వే హౌస్‌లో ఉండేలా, పౌర్డీకి 2 ఏళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది.

➡️