వరుసగా ఆరోసారి కూడా రెపోరేటులో మార్పు లేదు

Feb 8,2024 11:37 #RBI

ముంబై : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఫిబ్రవరి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. రెపో రేటు అనేది ఆర్‌బిఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. మూడురోజుల సమీక్షా సమావేశం తర్వాత గురువారం ఉదయం ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ రెపోరేటులో మార్పులేదని వెల్లడించారు. ద్రవ్యోల్బణం లక్ష్యానికి చేరువగా ఉందని, వృద్ధి అంచనాల కంటే మెరుగ్గా ఉందని దాస్‌ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.69 శాతంగా ఉంది. 2024-25లో 4 శాతంగా ఉంటుందని అంచనా. 2023-24 సంవత్సరంలో జులై – సెప్టెంబర్‌ త్రైమాసికంలో జిడిపి 7.6 శాతం వృద్ధి చెందింది. ఇక 2023-24 ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో జిడిపి 7.8 శాతంగా నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.

కాగా, ఆర్‌బిఐ మూడురోజుల ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఆర్‌బిఐ సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో ఆరు ద్వైమాసిక సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సమావేశాల్లో వడ్డీరేట్లు, ద్రవ్య సరఫరా, ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక సూచికలపై చర్చిస్తుంది.

➡️