ఆర్థిక అక్షరాస్యతపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు

May 29,2024 09:12 #Business

ప్రథమ బహుమతి రూ.25వేలు
హైదరాబాద్‌ : ఆర్థిక అక్షరాస్యతపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలను నిర్వహిస్తున్నామని ఫార్చ్యూన్‌ అకాడమీ కోాఫౌండర్‌ డాక్టర్‌ మణి పవిత్ర తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశ జనాభాలో 77 శాతం అక్షరాస్యులు ఉన్నప్పటికీ.. దాదాపు మూడో వంతు ప్రజలు ఆర్థిక నిరక్షరాస్యులుగానే ఉన్నారని తెలిపారు. గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ లిటరసీ సర్వే ప్రకారం.. కేవలం 24 శాతం కంటే తక్కువ మంది ఆర్థిక అక్షరాస్యులుగా ఉన్నారన్నారు. సైబర్‌ మోసాలకు గురైతున్న వారిలో కూడా ఎక్కువ మంది చదువుకున్న వాళ్లే ఉంటున్నారన్నారు. ఆర్థిక అక్షరాస్యత రేటుతో 144 దేశాలలో భారత్‌ 73వ స్థానంలో ఉందన్నారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, బడ్జెటింగ్‌, పెట్టుబడి వంటి వివిధ ఆర్థిక నైపుణ్యాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతంగా ఉపయోగించడంపై తాము అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఫార్చ్యూన్‌ అకాడమీ ఆర్థిక అక్షరాస్యతపై షార్ట్‌ ఫిల్మ్‌ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోందన్నారు. ఇంగ్లీష్‌ లేదా తెలుగులో రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఉండాలన్నారు. తొలి ముగ్గురు విజేతలకు వరుసగా రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలు చొప్పున.. మరో ఐదుగురికి రూ.1000 చొప్పున కన్సోలేషన్‌ బహుమతులు ఇస్తామన్నారు. వచ్చే జులై 31 వరకు ఎంట్రీలను స్వీకరిస్తామని.. ఆసక్తి కలిగిన వారు తమ వీడియోలను [email protected] కు ఇమెయిల్‌ చేయాలని సూచించారు.

➡️