Electric vehicle అమ్మకాల్లో మందగమనం

Jul 1,2024 21:34 #Business, #Electric Vehicles, #Sales
  • జూన్లో 14% పతనం
  • ప్రొత్సాహాకాల తగ్గింపు ప్రభావం

న్యూఢిల్లీ : దేశంలో విద్యుత్‌ వాహనాల అమ్మకాల్లో మందగమనం చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాది జూన్‌లో ఇవి కార్లు, ద్విచక్ర వాహన విక్రయాలు 1,06,081 యూనిట్లకు తగ్గాయి. ఇంతక్రితం నెల మేలో 1,23,704 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే 14 శాతం క్షీణత నమోదయ్యింది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన వాహన్‌ పోర్టల్‌లోని డేటా ప్రకారం.. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు 8,39,545 విద్యుత్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తం వాహన విక్రయాల్లో ఈ సంఖ్య 6.69 శాతంగా ఉంది. ఇవి అమ్మకాల్లో ద్విచక్ర వాహనాల వాటా 57 శాతంగా నమోదయ్యింది.
గతేడాది విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం భారీగా కుదించింది. గరిష్ఠంగా ఇచ్చే సబ్సిడీని రూ.60వేల నుంచి రూ.22,500కు కోత పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి విద్యుత్‌ వాహనాలకు ఇచ్చే సబ్సిడీని సగానికి తగ్గించింది. ఫేమ్‌-2 స్థానంలో కొత్తగా విద్యుత్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ద్విచక్ర వాహనానికి గరిష్ఠంగా ఇచ్చే సబ్సిడీని ఏకంగా రూ.10వేలకే పరిమితం చేసింది. త్రిచక్ర వాహనాల సబ్సిడీలోనూ కోత పెట్టింది. ఈ ప్రభావం ద్విచక్ర ఇవి కంపెనీలపై తీవ్రంగా పడిందని ఆ వర్గాలు తెలిపాయి. అనివార్యంగా ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. దీంతో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడింది.

➡️