రాందేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు మండిపాటు

Feb 28,2024 09:56 #Business
  • పతాంజలి తప్పుడు ప్రకటనలపై ఆగ్రహం

న్యూఢిల్లీ : బడా వ్యాపారవేత్త, యోగా గురు రాందేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే పతాంజలి వ్యాపార ప్రకటనలపై మండిపడింది. కంపెనీ ఉత్పత్తుల ప్రచారం, వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల విషయంలో కోర్టు ఇది వరకు ఇచ్చిన ఆదేశాలను ఉల్లఘించడంపై రాందేవ్‌ బాబా, పతాంజలి కంపెనీ సిఇఒ బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై గతేడాది నవంబర్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం పతంజలిని తీవ్రంగా హెచ్చరించింది. వివిధ రకాల వ్యాధులను నయం చేస్తుందంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో పతాంజలి కోర్టుకు హామీ ఇచ్చింది. దీన్ని మళ్ళీ విస్మరించడంతో ఐఎంఎ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కంపెనీ ఉత్పత్తుల ప్రచారం, వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల విషయంలో కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అమనుల్లాతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్‌ బాబాకు, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో ఎలాంటి ప్రకటనలూ ఇవ్వొద్దని మరోసారి హెచ్చరించింది. అదే విధంగా ప్రకటనల విషయంలో చూసీ చూడనట్లుగా కేంద్రం వ్యవహరించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది.

➡️