లోపాలను ఎత్తి చూపిస్తే బెదిరింపులు

Jul 2,2024 21:08 #Adani, #Business, #notices, #sebi
  • అర్థంలేని సెబీ నోటీసులు
  • వాస్తవాల గుర్తింపులో విఫలం
  • కొటాక్‌ బ్యాంక్‌ పేరేందుకు చేర్చలేదు..!
  • సెబీపై హిండెన్‌బర్గ్‌ విమర్శలు

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ సంస్థలపై చేసిన ఆరోపణలకు గాను అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌కు మార్కెట్‌ రెగ్యూలేటర్‌ సెబీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై హిండెన్‌బర్గ్‌ తీవ్రంగా స్పందించింది. భారతీయ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ సెబీ నోటీసులు జారీ చేసిందని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. భారత్‌లోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు చేసిన అవినీతి, మోసాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తే తమను సెబీ బయపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించింది. తమకు ఉద్దేశపూర్వకంగానే నోటీసులు జారీ చేసిందని ఆరోపించింది. అవినీతి అక్రమాలను బయటపెట్టిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత కూడా ఈ కేసులో వాస్తవాలను గుర్తించడంలో సెబీ విఫలమైందని హిండెన్‌బర్గ్‌ విమర్శించింది. తాము వివిధ సంస్థలతో కలిసి అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకున్నామని వస్తున్న ఆరోపణల్లోనూ వాస్తవం లేదని తెలిపింది. భారత్‌లోని శక్తిమంతమైన వ్యాపారవేత్తల లోపాలను ఎత్తిచూపితే ఇలా నోటీసులు పంపడం సరికాదని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది.
అదానీ గ్రూప్‌ అవకతవకలను బయటపెట్టిన సమయంలోనే తాము ఆయా కంపెనీల స్టాక్స్‌పై షార్ట్‌ చేసినట్లు స్పష్టంగా వెల్లడించామని పేర్కొంది. అంటే అదానీ షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి వాటిని అమ్మకాలు చేశామని తెలిపింది. అదానీ షేర్ల ష్టార్‌ సెల్లింగ్‌లో నిబంధనలు పాటించామని స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లతో ఉన్న సంబంధాలతో క్రయ, విక్రయాలు (షార్ట్‌) చేసి 4.1 మిలియన్‌ డాలర్ల (రూ.34 కోట్లు) ఆదాయం పొందామని.. అయితే.. సంస్థ ఖర్చులు, మిగతా వ్యయాలను లెక్కిస్తే తమకు ఏం మిగలలేదని తెలిపింది.

కోటాక్‌ భాగస్వామి ఎవరూ..!
‘అదానీ గ్రూప్‌ అవకతవకల వ్యవహారం భయటకు వచ్చే సమయంలో కోటక్‌ బ్యాంకు విదేశాల్లో ఫండ్‌ కంపెనీని ఏర్పాటు చేసింది. దాని సహాయంతో ఓ పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్స్‌ను షార్ట్‌ చేశారు. దీనివల్ల కోటక్‌ బ్యాంకుకు పెద్దగా లాభాలు ఏమి రాలేదు. కానీ.. సెబీ జారీ చేసిన షోకాజ్‌ నోటీసుల్లో ఎక్కడా కోటక్‌ పేరు గానీ, ఆ సంస్థ బోర్డు సభ్యుల ప్రస్తావన లేదు. సెబీ మరో శక్తిమంతమైన భారత వ్యాపారవేత్తను రక్షించే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది’ అని హిండెన్‌బర్గ్‌ తెలిపింది.
అదానీ గ్రూప్‌ సంస్థలు స్టాక్‌ ధరలను కత్రిమంగా పెంచాయని హిండెన్‌బర్గ్‌ 2023 జనవరిలో ఓ కీలక రిపోర్ట్‌ను విడుదల చేసి.. సంచలనం రేపింది. షేర్ల పెంపునకు కొన్ని విదేశీ పెట్టుబడిదారుల సహాయం తీసుకున్నారని అందులో ఆధారాలతో పేర్కొంది. విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందిందని వెల్లడించింది. ఇది ఆర్థికపరమైన నేరాలకు పాల్పడినట్లు అవుతుందని అదానీ గ్రూపునపై విమర్శలు చేసింది.

➡️