అంగన్వాడీలకు అండగా తల్లీ పిల్లలు

Dec 19,2023 21:43

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   అంగన్వాడీల పోరాటానికి ఆయా కేంద్రాల పరిధిలోని తల్లులు, పిల్లలు మద్దతు పలికారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద కొనసాగిన సమ్మె శిబిరంలో పలువురు తల్లులు తమ పిల్లలతో కలిసి పాల్గొన్నారు. ‘జగన్‌ మామా మా ఆయమ్మకు జీతం పెంచండి’ మా టీచర్ల కోర్కెలు తీర్చండి’ అంటూ చిన్నారులు పలకలపై రాసి ప్రదర్శించారు. ఈనేపథ్యంలో సమ్మె శిబిరం ప్రజలను ఆకర్షించింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇవ్వాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు 8 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించి కేంద్రాలను తెరిపించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా కవ్వింపు చర్యలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. పేదల పిల్లలకు, గర్భిణులకు అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా సచివాలయ ఉద్యోగులు, వెలుగు సిబ్బందితో తెరిపించి పని చేయడం సరికాదని అన్నారు. 8 రోజులు కాదు 80 రోజులైనా సమస్యలు పరిష్కరించేవరకు, వేతనాలు పెంచే వరకు అంగన్వాడీల పోరాటం కొనసాగుతుందని, వారికి సిపిఎం అండగా ఉంటుందని అన్నారు. అనంతరం ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. అధికసంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.అంగన్వాడీలకు అండగా తల్లిదండ్రులుజామి: అంగన్వాడీలకు తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ప్రత్యక్షంగా నిరసన శిబిరాల్లో పాల్గొని, సంఘీభావాన్ని తెలిపారు. అంగన్వాడీ లకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇవ్వాలని, సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అంగన్వాడీ కేంద్రాల పిల్లలు, వారి తల్లులు పాల్గొన్నారు. సమ్మె పోరాటంలో పాల్గొన్న పిల్లలు, తల్లులు అంగన్వాడీ వర్కర్స్‌, ఆయాలకు వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కారం చేయాలని, మా టీచర్‌, ఆయాలతోనే కేంద్రాలను నడిపించాలని కోరుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సెక్టార్‌ నాయకులు కనకమహాలక్ష్మి, రామలక్ష్మి, విష్షుణమ్మ, ఆదిలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీల బిక్షాటన అంగన్వాడీల సమ్మె నేపథ్యంలో జామి బస్టాండ్‌ లో బిక్షాటన చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిపై ర్యాలీగా ఎంపిడిఒ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, అధికారులు స్పందించి, రూ.1,780 విరాళాలుగా అందజేశారు. అంగన్వాడీ ఉద్యమానికి పరోక్షంగా సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గాడి అప్పారావు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. రామభద్రపురం : దీక్షా శిబిరం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌, పుర వీధుల్లో ఇంటింటా జోలె, తినే ఆకులు పట్టుకొని బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జీతాలు పెంచకపోతే ఆకులు,అలములు తిని బతకాలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కించడం దారుణమన్నారు. గజపతినగరం: అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలియజేయాలని గజపతినగరం ఐకెపి కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. అనంతరం ఎపిఎం జగదీష్‌కు వినతి పత్రం అందించారు. అంతకుముందు జాతీయ రహదారిపై బిక్షాటన చేశారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి.లక్ష్మి, అంగన్‌వాడీలు లక్ష్మి, జ్యోతి, సుభాషిని, సన్యాసమ్మ, రాములమ్మ, నారాయణమ్మ, త్రివేణిలు పాల్గొన్నారు. సమ్మెకు బాలింతలు, గర్బిణుల సంఘీభావంశృంగవరపుకోట: సమ్మెకు గర్భిణులు, బాలింతలు సంఘీభావం తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు గ్రాడ్యూటీ ఇవ్వాలని, గత ఆరు నెలల నుండి పెండింగ్‌లో ఉన్న సెంటర్‌ అద్దెలు, టిఎ బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు చెలికాని ముత్యాలు, అంగన్వాడి యూనియన్‌ లీడర్స్‌ డి శ్యామల, బి మాణిక్యం, సుశీల పాల్గొన్నారు.మా పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏమిటి?చీపురుపల్లి: అంగన్‌వాడీ సెంటర్లకు తమ పిల్లలను సచివాలయం ఉద్యోగులు పంపించ మంటున్నారని, అక్కడ తయారు చేసిన ఆహారం పిలల్లకు పెడితే వారి పరిస్థితి ఏమౌతుందని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి గర్భిణులను, చిన్న పిల్లలను అంగన్‌వాడీ ద్వారా అందించే ఆహారాన్ని తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని అంగన్‌వాడీ టీచర్లు వండితేనే తాము తీసుకుంటామని తెగేసి చెప్పారు. అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న చోటకి వెళ్లి తామంతా అంగన్‌వాడీల వెంటే ఉంటామని పిల్లల తల్లిదండ్రులు చెప్పారు.

సచివాలయ ఉద్యోగుల నిర్బంధం

బొబ్బిలి : బొబ్బిలిలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ ఉద్యోగులు స్వాధీనం చేసుకోవడంతో అంగన్వాడీలు ఆగ్రహించి గొల్లపల్లిలో సచివాలయ ఉద్యోగులను అంగన్వాడీ కేంద్రంలో అంగన్‌వాడీలు, చిన్నారుల తల్లులు నిర్బంధించి నిరసన తెలిపారు. జంగాలవీధి, సింగారపువీధి, పాతబొబ్బిలిలో అంగన్వాడీ కేంద్రాల నుంచి సచివాలయ ఉద్యోగులను బయటకు నెట్టివేసి అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఉమాగౌరి, దేవి, అనురాధ, శ్రీదేవి, కామేశ్వరి, రాజీ, పార్వతి మాట్లాడుతూ అంగన్వాడీలను రెగ్యులర్‌ చేసి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఆందోళన ఉధతం చేస్తామని హెచ్చరించారు.

➡️