అంగన్వాడీలకు సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలి

అంగన్వాడీలతో మాట్లాడుతున్న ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

అంగన్వాడీలకు సమ్మె కాలపు వేతనాలు ప్రభుత్వం తక్షణమే చెల్లించి వారిని ఆదుకోవాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి డిమాండ్‌ చేశారు. మండలంలోని అంగన్వాడీల ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం యూనియన్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.నిర్మల అధ్యక్షతన జరిగింది. ఇందులో పాల్గొన్న బేబిరాణి మాట్లాడుతూ అంగన్వాడీలకు సమ్మె కాలపు వేతనం చెల్లిస్తామని జనవరి 22న రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినా ఇంతవరకు దానిని అమలు చేయలేదన్నారు. 2 నెలల వేతనాలతో బాటు, రెండు నెలల సెంటర్‌ అద్దెలు, ఒక నెల కూరగాయల బిల్లులు, 2022 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 16 నెలలుగా రావాల్సిన ఈవెంట్స్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కొన్ని సెక్టార్ల పరిధిలోని వర్కర్లకు 2022 ఆగస్టు వేతనం ఇవ్వలేదన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి శేషు బాబ్జి, పి.రామరాజు, ఈశ్వరరావు, యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్సులు పద్మ, చంద్రావతి, నాయకులు కె రాణి, కె వెంకటలక్ష్మి, బేబీ వీరమణి, జ్యోతి, నాగమణి, ఎస్తేరు రాణి, ధనలక్ష్మి, బుల్లెమ్మ, రాజేశ్వరి, ఎం సమాధానం, శ్రీను, బాలం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️