అంగన్వాడీ కేంద్రం తెరవకుండా అడ్డగింత

Dec 15,2023 20:10

  ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  విజయనగరంలో శుక్రవారం ఉదయం అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు కలిసి ప్రయత్నించారు. కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న సంజీవయ్య కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని నగరపాలక సంస్థ కో ఆప్షన్‌ సభ్యుడు రహీమ్‌ దగ్గరుండి తాళాలు కొట్టించి తెరిపించారు. మరో వైపు బాలాజీ మార్కెట్‌ పక్కనే ఉన్న రెల్లివీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు సచివాలయ సిబ్బంది రావడంతో ఆ ప్రాంత వాసులు తెరవనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక్కడ పని చేస్తున్న అంగన్వాడీ వర్కర్‌, ఆయాలు తమ పిల్లలను తల్లులుగా చూస్తున్నారని అన్నారు. వారి సొంత బిడ్డలాల్లో మా పిల్లలు మల మూత్ర విసర్జన చేసినా సేవ చేస్తున్నారని, ఆ పనులన్నీ మీరు చేస్తారా అని ప్రశ్నించారు. చేతనైతే సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. వీధిలో తాగునీరు రాకపోయినా, కాలువలు ,రోడ్లు లేక పోయినా పట్టించుకోని సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. చేసేది లేక 12 గంటలు వరకు వేచి చూసి సచివాలయం సిబ్బంది వెళ్ళిపోయారు.

➡️