అంతటా సంక్రాంతి సందడి

అంతటా సంక్రాంతి సందడి

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిజిల్లాలో పల్లెలు, పట్టణాలలో సంక్రాంతి సందడి నెలకొంది. తొలి రోజైన భోగి పండుగ పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఏడాది పొడవునా అనేక పండుగలు ఉన్నప్పటికీ తెలుగు వారి ఇళ్లలో సంక్రాంతి ప్రత్యేకమైంది. పంటలు పొలం నుంచి ఇళ్లకు చేరడం ప్రారంభమయ్యే సమయంలో వచ్చే ఈ పర్వదినాన్ని గ్రామీణ ప్రాంతంలోని రైతులు, రైతుకూలీలు, వృత్తులపై ఆధాపడి జీవించేవారంతా పెద్దఎత్తున నిర్వహిస్తుంటారు. కాలక్రమంలో అనేక మార్పులు సంభవించినా సంక్రాంతి పండుగను మాత్రం అన్నివర్గాల ప్రజలు ఘనంగానే జరుపుకుంటున్నారు. మారుతున్న కాలానుగుణంగా ఆభరణాలు, వస్త్ర దుకాణాలు నూతన డిజైన్లు అందుబాటులోకి తేవడంతో పాటు ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్నాయి. పండుగల నేపథ్యంలో ఉపాధి కోసం, ఉద్యోగ, వ్యాపార రీత్యా పొరుగు ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం సంక్రాంతి పండుగ మూడు రోజులు స్వగ్రామాలకు వచ్చి ఉల్లాసంగా గడపడం అనవాయితీ. ఈసారి కూడా పొరుగు ప్రాంతాల్లో ఉండే వేలాదిగా జిల్లావాసులు స్వస్థలాలకు చేరారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా జిల్లాలోని బస్‌ కాంప్లెక్స్‌లు, రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడాయి. భోగి పండుగ రోజైన ఆదివారమూ రద్దీ కొనసాగింది. పలు చోట్ల క్రీడా, సాంస్కతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలుప్రాంతాల్లో రాజకీయ పక్షాల ఆధ్వర్యంలోనూ ఆయా వర్గాలను భాగస్వామ్యం చేస్తూ ఈ తరహా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆటల పోటీలు, సాంస్కతిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో పల్లె, పట్టణం తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రీడా సాంస్కతిక పోటీలు జరుగుతున్నాయి. స్థానికంగా ఎక్కడికక్కడ యువకులు, వివిధ ప్రజాసంఘాలు కూడా కలిసి రావడంతో మరింత ఉత్సాహం నెలకొంది. క్రికెట్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ వంటివి నిర్వహిస్తున్నారు. మరోవైపు మహిళలను ఉత్సాహరుస్తూ ముగ్గులు, ఇతరత్రా పోటీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్రాంతి వేడుకలపై రాజకీయపక్షాల ప్రభావం కనిపిస్తోంది. పలుచోట్ల వివిధ స్థాయిల్లోని రాజకీయ పక్షాల నేతలు వివిధ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గుల పోటీలకు విలువైన బంగారు బహుమతులు, బైకులు సైతం పంపిణీ చేసిన విషయం విదితమే. అయితే జిల్లాలోని రైతుల ఇళ్లలో మాత్రం సంక్రాంతి వేడుకల ఉత్సాహం అంతగా కనిపించడం లేదు. ఈ ఏడాది అనావృష్టితో ఖరీఫ్‌, భారీవర్షాలతో రబీ దెబ్బతినగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రైతులు పంటలను సాగు చేస్తున్నారు.

➡️