అంతర్‌ రాష్ట్ర సరిహద్దు యంత్రాంగం సమన్వయంతో పని చేయాలి

Mar 28,2024 22:41

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతర్‌ రాష్ట్ర సరిహద్దు జిల్లాల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల గుండా మద్యం, డబ్బు, ఆభరణాలు, మత్తు మందు వంటి వాటి సరఫరాను నిరోధించడంలో భాగంగా గురువారం తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం, వాడపల్లి వద్ద ఉన్న ఇండియన్‌ సిమెంట్స్‌ సమావేశ మందిరంలో అంతర్‌ రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రెవిన్యూ, పోలీస్‌ ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేలా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయడమే కాకుండా, సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయాలని, సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు చేపట్టే విధంగా చూడాలని అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన మాట్లాడుతూ నల్గొండ-పలనాడు జిల్లాల అంతర్‌ రాష్ట్ర సరిహద్దులో 3 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిని నిరంతరం సీసీటీవీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 4.5 కోట్ల నగదు, మద్యం, ఆభరణాలను సీజ్‌ చేశామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుండి మరిన్ని సీజర్లు పెరిగే అవకాశం ఉందన్నారు. చెక్‌పోస్టుల్లో సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండొవద్దని, ముఖ్యంగా కెనాల్‌ పాయింట్లు, నాగార్జునసాగర్‌ చివరి ఆయకట్టు ప్రాంతంలో నిఘా ఎక్కువగా ఉంచాలని సూచించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో డబ్బు, మద్యం, మత్తు పదార్థాలు సరఫరా కాకుండా చూడాలన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటరావు, నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి, సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ మాట్లాడుతూ మూడు జిల్లాల పోలీస్‌ యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటి సమాచారమైన ఒకరికోకరు చేరవేసుకోవాలని, రహదారులపై ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులతోపాటు కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నదిగుండా అక్రమంగా సరఫరా చేసే డబ్బు, మద్యం, వంటి వాటిని అరికట్టేందుకు సైతం చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎక్సైజ్‌ , ట్రాన్స్పోర్ట్‌, సివిల్‌ సప్లై, ఇతర శాఖల అధికారులతో కలిసి వాడపల్లి వద్ద ఉన్న అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు.

➡️