అంతిమ విజయం ‘ఏలూరి’దే

ప్రజాశక్తి-పర్చూరు: ప్రశాంతంగా ఉన్న పర్చూరులో ఎన్ని అలజడులు, అరాచకాలు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుదేనని, నియోజక వర్గంలో ఆమంచి కుట్రలు సాగవని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్‌ జమాలుద్దీన్‌, కారంచేడు మండల ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖాసిం అన్నారు. సోమవారం పర్చూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో కలిసి వారు విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలమైన నేతగా ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే ఏలూరిని రాజకీయంగా ఎదుర్కోలేక వైసిపి ప్రభుత్వ పెద్దలు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గత 12 ఏళ్లుగా పర్చూరు నియోజకవర్గ ప్రశాంత వాతావరణంలో అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. ఏడాదికాలంగా వైసిపి ఇన్‌ఛార్జిగా వచ్చిన ఆమంచి కృష్ణమోహన్‌ ఆగడాలకు హద్దు లేకుండా పోయిందన్నారు. అందినకాడికి దోచుకుంటూ భయానక వాతావరణ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక మైనింగ్‌, రేషన్‌ బియ్యం దోపిడీతో అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పర్చూరు మండల అధ్యక్షుడు షేక్‌ శంషుద్దీన్‌, మైనార్టీ సెల్‌ సీనియర్‌ నాయకులు హుస్సేన్‌, రఫీ, గౌస్‌, మస్తాన్‌వలి, ఫారూఖ్‌, సుభాని, షేక్‌ అక్రమ్‌, మహమ్మద్‌ ఇషాక్‌, గంజం అల్పాస్‌, షేక్‌ మౌలాలి, రెహమాన్‌, షేక్‌ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

➡️