‘ఉక్కు’ పరిరక్షణకు తీర్మానించాలి

Jun 21,2024 00:21 #Steel deekshalu
steel plant deekshalu

ప్రజాశక్తి,-ఉక్కునగరం: రాష్ట్ర మొట్టమొదటి క్యాబినెట్‌ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం పాటు విశాఖ ఉక్కు పరిరక్షణ, ప్రభుత్వ రంగంలో కొనసాగింపు, సెయిల్‌లో విలీనం, వర్కింగ్‌ క్యాపిటల్‌కు ఆర్థిక పరిపుష్టి కల్పనపై చర్చించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలో పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం నాటికి 1225వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరాహార దీక్షలో ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌ -1 కార్మికులు కూర్చున్నారు. ధర్నానుద్దేశించి పోరాట కమిటీ నాయకులు శ్రీనివాసరావు, డి.ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, జె.అయోధ్యరాం, డేవిడ్‌, ఎన్‌.రామారావు మాట్లాడుతూ, దేశంలోనే సముద్రతీరంలో ఉన్న భారీ ఉక్కు పరిశ్రమ, దక్షిణ భారతదేశంలో ఇంటిగ్రేటెడ్‌ మెటలర్జికల్‌ 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో లాభంలో నడుస్తూ అనతి కాలంలోనే 10.5 ఎమ్‌టి సామర్థ్యానికి ప్రణాళికతో ముందుకెళుతున్న త రుణంలో కేంద్ర ప్రభుత్వం రెండు మిలియన్‌ టన్నుల స్థాయికి దిగజార్చి రూ.4వేల కోట్ల నష్టాల వైపుకు నెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. నవరత్న హోదా కూడా ప్రశ్నార్థకం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణమూర్తి, సుబ్బయ్య, చంద్రమౌళి, బాపూజీ, డిసిహెచ్‌, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

➡️