అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ధర్నా

ప్రజాశక్తి-పిసిపల్లి : పెదచెర్లోపల్లి మండలం పెద్దఇర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని కోదండరామపురం, మెట్లవారిపాలెం గ్రామంలో దళితుల భూములను అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా 1994లో భూమిలేని 22 మంది దళితులకు ప్రభుత్వం భూములు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి ఒక్కొక్కరికీ రెండు ఎకరాలు చొప్పున ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ భూమిని 1994లో రిజిస్ట్రార్‌ తాకట్టు పెట్టుకుని ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా ఒక్కొక్కరు రూ.8.400 చొప్పున రుణం తీసుకున్నట్లు తెలిపారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలు రద్దు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా భాగంగా వీరు అప్పులు రద్దు అయ్యాయన్నారు. అయితే 2023 వరకూ ప్రభుత్వం దగ్గర వీరి భూమి హక్కులు ఉన్నాయన్నారు. అయితే 2010లో ఎలా రిజిస్ట్రేషన్‌ జరిగిందని ఆయన ప్రశ్నించారు. అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కై భూములు కాజేసినట్లు తెలిపారు. దళితుల భూములు కాజేసిన వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసి దళితులకు హక్కు కల్పించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దళితులకు ఇచ్చిన పట్టా భూముల్లో అక్రమదారులు జామాయిల్‌ చెట్లు సాగుచేసినట్లు తెలిపారు. తమ భూముల్లోని జామాయిల్‌ చెట్లను తొలగించేందుకు వెళ్లిన 22 మందిపై అక్రమంగా కేసు పెట్టడం అన్యాయమన్నారు. దళితులపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు మహేష్‌, ఎర్రగుంట్ల పెద్దబాలయ్య, ఎర్రగుంట్ల చిన్నబాలయ్య, నారాయణ, మార్కండేయులు, రాగి మాల్యాద్రి, కనపర్తి లక్ష్మమ్మ, వలేటి మాలకొండమ్మ, బాధిత రైతులు పాల్గొన్నారు.

➡️