అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర ఆరంభం

క్రికెట్‌ ఆడుతున్న సిఎం జగన్‌
ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్‌ స్కూల్‌ క్రీడ మైదానంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆడుదాంఆంధ్ర-2023’ పోటీలను ప్రారంభోత్సవం మంగళవారం అట్టహాసంగా జరిగింది. ఉత్సాహ భరిత వాతావరణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. క్రీడా కారులతో ముచ్చటించి వారితో కలిసి క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ ఆడారు. శాప్‌ పతాకాన్ని, జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. క్రీడాస్ఫూర్తితో పనిచేస్తామని క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. క్రీడా జ్యోతిని వెలగించి క్రీడాకారులకు అందించారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌తో కలిసి క్రీడా జ్యోతిని తిరిగి అందుకున్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మిటన్‌ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు కిట్లను అందించారు. మంత్రి రోజా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, శ్యాప్‌ చైర్మన్‌ సిద్ధార్ధరెడ్డితో కలిసి క్రికెట్‌ ఆడారు. ప్రభుత్వ, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్లు, మున్సిపల్‌ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను గుర్తించి అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా సిఎం ప్రకటించారు. రాబోయే సంవత్సరాల్లో క్రీడాభివృద్ధికి అడుగులు ఇంకా వేగంగా పడతాయన్నారు. ప్రతి స్కూల్లోనూ క్రీడలకు ప్రోత్సహం ఉంటుందని, ప్రతి పాఠశాలకు కిట్లు అందిస్తామని చెప్పారు. క్రీడల ద్వారా అన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చునన్నారు.ఆరోగ్య సమస్యలపై ఆర్థిక సాయానికి భరోసానల్లపాడు హెలిపాడ్‌ వద్ద సిఎం జగన్‌ పలువురు నుంచి వినతులు స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి మందులు, వైద్య, ఇతర అవసరాల కోసం వచ్చిన వినతుల పట్ల సానుకూలంగా స్పందించారు. ఉదారంగా ఆదుకోవాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు. గుంటూరు 25వ డివిజన్‌కు చెందిన కాశిరెడ్డి కుమారుడు ఎనిమిదేళ్ల బి.నాగత్రినాథ్‌రెడ్డి రెండేళ్లుగా హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నందున, స్పీచ్‌ థెరపి కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. వైద్యం కోసం చేసిన ఖర్చులు రూ.20 లక్షల ఆర్థిక సాయం, ప్రతినెల చికిత్స కోసం రూ.20 వేల నెలవారీ పెన్షన్‌ మంజూరు చేయాలని అభ్యర్ధించారు. నెలావారీగా ఖర్చు చేసుకునేందుకు, వైద్యఖర్చులు, స్పీచ్‌ థెరపీ కోసం ఫిక్సడ్‌ డిపాజిట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడుకు చెందిన బ్రహ్మయ్య తన ఐదేళ్ల కుమారుడు రాజవరపు మోక్షిత్‌కు మోషన్‌ వెంటిలేషన్‌ ట్రాక్‌ చికిత్స కోసం ఖర్చు చేసిన రూ.12 లక్షలు సాయంగా ఇవ్వాలని కోరారు. వైద్యఖర్చుల బిల్లుల ప్రకారం మొత్తాన్ని మంజూరు చేస్తామని సిఎం హామీ ఇచ్చారు. చిలకలూరిపేటకు చెందిన 39 ఏళ్ల సయ్యద్‌ రహమతుల్లా తీవ్రమైన అక్యూట్‌ ప్యాంక్రియాటైటీస్‌ వ్యాధి చికిత్స కోసం చేసిన వైద్య ఖర్చులు రూ.45 లక్షల అయితనట్లు తెలపగా బిల్లులను చెల్లిస్తామని సిఎం హామీ ఇచ్చారు.

➡️