అడ్డగోలుగా చేపట్టిన అక్రమ బదిలీలను తక్షణమే రద్దు చేయాలి : యుటిఎఫ్‌

Mar 15,2024 22:41

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సిఫార్సు బదిలీలు, లక్షలాది రూపాయిల చేతులు మారడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు బదిలీలు వెంటనే రద్దు చేయాలని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, జి.విజయసారధి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. గతేడాది మే, జూన్‌ నెలల్లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు నిర్వహించినా ఏడాది లోపే కౌన్సిలింగ్‌ విధానానికి తూట్లు పొడుస్తూ విద్యార్థులకు పరీక్షల సమయంలో పెద్ద ఎత్తున అక్రమంగా బదిలీలు సరికాదని పేర్కొన్నారు. పల్నాడు ప్రాంతంలోని పాఠశాలలో పని చేస్తున్న అనేక మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బదిలీలకు సిఫార్సు చేయడంతో పల్నాడు ప్రాంత విద్యారంగం మరోసారి ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాసులున్న వారికి, మంత్రులు ఎమ్మెల్యేల అండదండలున్న వారికి అక్రమ బదిలీలు చేస్తుంటే సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షల సమయంలో బదిలీలు చేయటం విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో తెలిసిందని విమర్శించారు. ఈ చర్యలను మానుకోకుంటే ఉపాధ్యాయులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

➡️