అపెక్స్‌ హేచరీపై గ్రామస్తులతో చర్చలు

ప్రజాశక్తి – భోగాపురం: మండలంలోని చేపలకంచేరు పంచాయతీ దిబ్బలపాలెం గ్రామం వద్దనున్న అపెక్స్‌ రొయ్య పిల్లల హేచరీ తెరిపించేందుకు అధికారులు, యాజమాన్యం, గ్రామపెద్దలతో కలిసి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు రెండున్నరేళ్ల కిందట గ్రామస్తులకు, ఈ కంపెనీ మద్య వివాదం నెలకొంది. దీంతో అప్పటి నుంచి ఈ హేచరీని మూసివేశారు. అప్పట్లో ఈ హేచరీకి సంబంధించిన వృధా నీరు రైతుల జిరాయితీ పొలాలు మీదుగా పైపుల ద్వారా సముద్రంలోకి విడిచిపెట్టేవారు. దీంతో వివాదం మొదలై చివరకు రైతులు తమ పొలాల్లో నుంచి వెళ్తున్న పైపులైన్లు ద్వంసం చేశారు. దీంతో కంపెనీ యాజమాన్యం కొంతమందిపై కేసులు నమోదు చేసింది. అయితే ఇటీవలి హేచరీ యాజమాన్యం కంపెనీ తెరిపించేందుకు సహకరించాలని కలెక్టరును ఆశ్రయిం చారు. కలెక్టరు ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ అప్పలనాయుడు, తహశీల్దారు బంగార్రాజు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌ రాజా, మత్స్యశాఖ అధికారి చాందిని ఇతర అధికారుల సమక్షంలో పెద్దలు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, గ్రామస్తులు దల్లి బంగారు రెడ్డి, ఎల్లారావు తదితరులు సమావేశం అయ్యారు. గ్రామస్తులు యాజమాన్యం మద్యం చర్చలు జరిగాయి. గ్రామస్తులతో మరోసారి ఆలోచించి ఈ నెల 26వ తేదీన మరోమారు సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం హేచరీ ప్రారంభించాలని నిర్ణయించారు. చర్చల్లో ఇఒపిఆర్‌డి సురేష్‌ పాల్గొన్నారు.

➡️