అభద్రత

Mar 2,2024 20:37 #అభద్రత

జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు బ్రేకులు పడట్లేదు. కడప, అన్నమయ్య జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాల ముగియక మునుపే మదనపల్లి, రాయచోటి కేంద్రాల్లో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్లకార్డుల ప్రదర్శనతో ర్యాలీలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నిపుణుల సూచనల్ని అమలు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. గత సోమవారం మదనపల్లి కేంద్రంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను, లారీని, స్కార్ఫియో ఢకొీన్న ఘటనల్లో సుమారు తొమ్మిది మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. మరుసటి రోజు రాయచోటి సమీపంలోని సరస్వతీపల్లి సమీపంలోని పట్టుపరిశ్రమల కేంద్రం దగ్గర లారీని బైక్‌ ఢకొీన్న ఘటనలో ముగ్గురు మరణించడం ఆందోళన కలిగించింది. రోడ్డు ప్రమాదాల పరం పరకు అడ్డుకట్ట వేయలేమా అని ప్రశ్న నిరంతరం వేధిస్తూ ఉంటోంది. ఆస్పత్రికి వెళ్దామని ఇంటి నుంచి బయల్దేరిన ఓ తల్లీబిడ్డ, కుమారుడు అనంతలోకాలకు చేరుకోవడం సరస్వతీపల్లిని శోకసముద్రంలో ముంచింది. చేతికొచ్చిన బిడ్డల్ని రోడ్డు ప్రమాదాలు బలితీసు కుంటుండడం తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. దీనికి బాధ్యులు ఎవరు? విధి విలాసమా, లేక సంబంధిత శాఖల తప్పిదమా అనేది ఆలోచన చేయాలి. రోడ్డుట్రాన్స్‌పోర్టు, ప్రజారవాణా శాఖ, పోలీస్‌ శాఖలు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల వాహనదారులకు అవగాహన కల్పించడంలో తరుచుగా విఫలమవుతుండడానికి గల కారణా లేమిటో అన్వేషించాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు దొర్లుతోందో గుర్తించి సరిచేయాలి. రోడ్లు మలుపుల దగ్గర హెచ్చరికల బోర్డులు, మార్కింగ్‌, హెచ్చరిక బోర్డులు, మెర్క్యూరీ లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు వాహనచోదకులకు తరుచుగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు పరీక్షల్ని నిర్వహించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్మడి జిల్లాలోని కడప-రాయచోటి ఘాట్‌రోడ్లు, రాజంపేట-రాయచోటి ఘాట్‌రోడ్లు, చిట్వేలి-రాపూర్‌ ఘాట్‌రోడ్లలోని మలుపుల దగ్గర వేగనియంత్రణ యాంత్రికల్ని ఏర్పాటు చేయడం, లోయల వైపున కాంక్రీట్‌ వాల్స్‌ ఏర్పాటు చేయడం, రోడ్లను విస్తరించడం వంటి పద్ధతులను పాటించాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోనిపక్షంలో మానవ తప్పిదాల కారణంగా భావియువత తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధిత కుటుంబాల్లో అంతులేనిక్షోభను నింపినట్లు అవుతుందని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్డు భద్రతా వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లాలి. అప్పటి రోడ్డు ప్రమాదాల నివారణ బ్రహ్మపదార్థంగా గోచరిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్న సింగపూర్‌, మలేషియా, దుబారు వంటి దేశాల్లోని పద్ధతుల్ని పరిశీలించాలి. ఇక్కడి దేశీయ పరిస్థితులను బట్టి అమలు చేయడానికి ప్రయత్నించాలి. ఏదేమైనా రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి పద్ధతులను అనుసరిస్తే తగ్గుముఖం పడతాయోననే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️