అభ్యర్థుల ఖర్చులను పక్కాగా నమోదు చేయాలి

Mar 18,2024 23:47

సమీక్షలో మాట్లాడుతున్న గుంటూరు కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ (ఆర్‌ఓ) కమిషనర్‌ కీర్తి
ప్రజాశక్తి-గుంటూరు :
ఎన్నికల నిర్వహణలో ఎక్స్‌పెండీచర్‌ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని, కమిటి సభ్యులు అత్యంత జాగ్రత్తగా రాజకీయ పార్టీల, అభ్యర్థుల ప్రచార ఖర్చులను రికార్డ్‌ చేయాలని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌(ఆర్‌ఓ) కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్‌పెండిచర్‌ కమిటీ అధికారులతో కమిషనర్‌ తన ఛాంబర్‌లో సోమవారం సమావేశమయ్యారు. కమిటీలో అధికారులందరూ తప్పనిసరిగా ఎన్నికల సంఘం అందించిన హ్యాండ్‌ బుక్‌లెట్‌ సమగ్రంగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని, ప్రతి ఖర్చు సంబంధిత ఖాతాలో రికార్డ్‌ చేయాలని, ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌, ఆర్‌.ఓ.లకు నిర్దేశిత ప్రొఫార్మాలో రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్ధుల ర్యాలీలు, ప్రచార సభలు, కార్యకర్తల ఖర్చులు, ప్రచార సామగ్రి తదితర అంశాల వారీగా ఖర్చులు రికార్డ్‌ చేయాలన్నారు. సమావేశంలో ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ నాగేంద్ర కుమార్‌, ఎంసిసి టీం నుండి శ్రీధర్‌ పాల్గొన్నారు.
పటిష్టంగా ఎన్నికల కోడ్‌ అమలు
గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలుకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌(ఆర్‌ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్‌ ఛాంబర్‌లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసిసి) అధికారులతో సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ మేరకు నగరంలోని ప్రభుత్వ భవనాలపై ఉన్న వాల్‌ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాల తొలగింపు ప్రక్రియ సోమవారం సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశించారు. పార్కులు, అంతర్గత రహదారుల్లో కూడా ఎటువంటి రాజకీయ పార్టీల ప్రచార బ్యానర్లు, పోస్టర్లు ఉండటానికి వీలు లేదన్నారు. ప్రతి అధికారి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సంతకంతో కూడిన నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల ఆఫీసులకు కూడా ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు మాత్రమే జెండాలను బ్యానర్లు ఏర్పాటు చేసుకునేలా తెలియచేయాలని, నిబంధనలు విరుద్ధంగా ఉన్న వాటిని తక్షణం తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల విధులు అత్యంత కీలకమని ప్రతి ఒక్కరూ కేటాయించిన విధుల పట్ల అంకిత భావం బాధ్యతగా లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఈ శ్యాంసుందర్‌, సిఎంఓహెచ్‌ డాక్టర్‌ ఆషా, డిప్యుటీ కమిషనర్‌ వెంకటలక్ష్మి, ఎ.ఆర్‌.ఓ లు సునీల్‌, భీమరాజు, ఎం.సి.సి టీం శ్రీధర్‌ పాల్గొన్నారు.

➡️