అయ్యప్పనగర్‌ అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌

Mar 15,2024 20:21

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఏడాది కాలంగా అయ్యప్పనగర్‌లోని అక్రమ వాటర్‌ ప్లాంట్‌ను సీజ్‌ చేయాలని చేసిన పోరాట ఫలితంగా వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చేసిన అధికారులకు, తమ పోరాటానికి అండగా నిలిచిన ప్రజా సంఘాల నాయకులకు, వార్డు ప్రజలకు పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు,అయ్యప్ప నగర్‌ పోరాట కమిటీ కన్వీనర్‌ యుఎస్‌ రవికుమార్‌ అభినందనలు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీజ్‌ చేసిన దృశ్యాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏడాది కాలంగా అయ్యప్ప నగర్‌ లో అక్రమంగా ఉన్న స్వాతీప్యూర్‌ ఫైర్‌ వాటర్‌ ప్లాంట్‌ వల్ల కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూ గర్భ జలాలు ఇంకి పోవడం వలన చుట్టుపక్కల నివాసాలకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదే విషయాన్ని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేసినప్పటికీ ఏడాది కాలంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారన్నారు. అది అక్రమ వాటర్‌ ప్లాంట్‌ అని ఆధారాలు రుజువు కావడంతో ఎట్టకేలకు అధికారులు గురువారం వాటర్‌ ప్లాంట్‌ను సీజ్‌ చేశారని తెలిపారు. ఏడాదిగా జరిపిన పోరాటంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం, ఇతర ప్రజా సంఘాలు, వార్డు ప్రజలు అండగా నిలిచినందుకు వారికి అభినందనలు తెలిపారు. అదే విధంగా నగరంలో అనేక అక్రమ వాటర్‌ ప్లాంట్‌లు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ సీజ్‌ చేసి నగర ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కంది. త్రినాథ్‌, ఎన్‌.సుధీర్‌ పాల్గొన్నారు.

➡️