అరెస్టులు.. నిర్బంధాల నడుమ సిఎం పర్యటన

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి/భీమవరం రూరల్‌

సిఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో శుక్రవారం భీమవరంలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులపై పోలీసుల అరెస్టులు, నిర్బంధాలతో విరుచుకుపడ్డారు. దాదాపు 1800 మంది పోలీసులు భీమవరం పట్టణంలో మోహరించడం గమనార్హం. ఎటువంటి నోటీసూ ఇవ్వకుండానే ముందస్తుగా రాత్రికి రాత్రి ఇళ్లకు వెళ్లి కొందరు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేయగా మరికొందరిని ఆయా పరిధిలోని పోలీస్‌ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. విద్యాదీవెన సొమ్ము విడుదల సందర్భంగా శుక్రవారం భీమవరంలో సిఎం జగన్‌ పర్యటన సాగింది. ఉదయం 11.40 గంటలకు భీమవరం లూథరన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు సిఎం చేరుకున్నారు. అక్కడి నుంచి బైపాస్‌ రోడ్డులోని సభకు రోడ్డు మార్గం గుండా సిఎం చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సిఎం తన ప్రసంగం ముగించి ఆయన వెళ్లే వరకు పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. అరెస్టుల పేరుతో సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు, అంగన్వాడీలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాంను ఆ పార్టీ జిల్లా కార్యాలయంలోనే నిర్బంధించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి, జిల్లా అధ్యక్షులు పి.విజయరామరాజు, సిపిఐ నాయకులు చెల్లబోయిన రంగారావు, బిజెపి నాయకులు శ్రీనివాసవర్మను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిపిఎం నేత జెఎన్‌వి.గోపాలన్‌ స్టేషన్‌లోనే నిరాహార దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. తమ సమస్యలపై నిరసన తెలుపుతున్న అంగన్వాడీలపై పోలీసులు మరింత విరుచుకుపడ్డారు. సిఐటియు కార్యాలయం వద్ద, మున్సిపల్‌ కార్యాలయం వద్ద మొత్తం 60 మంది అంగన్వాడీలను అరెస్ట్‌ చేసి భీమవరం, కాళ్ల పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అంగన్వాడీ నాయకులు సిహెచ్‌.మహాలక్ష్మి, కనకదుర్గలను ముందుగానే గృహనిర్బంధం చేయగా మరో నాయకురాలు విజయలక్ష్మిని భీమవరంలో అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో సిఐటియు నాయకులు ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు అంగన్వాడీలు పెద్దసంఖ్యలో చేరుకుని అక్రమ అరెస్టులను నిరసిస్తూ నాయకులను తక్షణమే విడుదల చేయాలంటూ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. అరెస్టుల విషయం తెలుసుకున్న పారిశుధ్య కార్మికులు, కార్మిక సంఘం నాయకులు వారికి మద్దతుగా చేరి నినదించారు. ప్రజా ఉద్యమాలపై నిర్బంధం మోపిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయని హెచ్చరించారు.జగన్మోహన్‌రెడ్డికి భయమెందుకు..? అక్రమ అరెస్టులు, నిర్బంధం నేపథ్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మీడియాతో మాట్లాడుతూ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 175కు 175 ఎంఎల్‌ఎ సీట్లు గెలుచుకుంటామని గొప్పలు చెప్పుకునే జగన్మోహన్‌రెడ్డికి భయమెందుకని ప్రశ్నించారు. ఎటువంటి నిరసన కార్యక్రమాలకూ పిలుపునివ్వని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని నిలదీశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అవలంబించడం వల్లే ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ఆ భయంతోనే పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. అరెస్టులు కాదని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిపిఎం, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రికి చేతనైతే సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లాలో కాలుష్యం, డెల్టా ఆధునికీకరణ, పంట నష్టం, కౌలు రైతులు, దళితుల శ్మశానాలు, రోడ్ల అధ్వానం సమస్యలు, అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్షాభియాన్‌ ఉద్యోగులు వంటి అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. యనమదుర్రు డ్రెయిన్‌పై నిర్మించిన వంతెనలకు అప్రోచ్‌ రోడ్లు లేవన్నారు. కరెంట్‌ ఛార్జీలు, పన్ను పెంపుతో జగన్‌ ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.

➡️