అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు

Feb 26,2024 21:44

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడమే కాకుండా వాటికి పూర్తి హక్కు పత్రాలను కూడా అందించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ధ్యేయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పునరుద్ఘాటించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందజేశారు. నగర పరిధిలో ఉన్న లబ్ధిదారులకు ఇప్పటికే గుంకులాం, జమ్ము, కొండకరకాం, సారిక, ప్రాంతాలలో మొత్తం 19,601 మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేశామన్నారు. వాటిలో ఇప్పటివరకు 12,009 మంది లబ్ధిదారుల పట్టాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి అయిందన్నారు. గతంలో పేదలకు తాము ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేస్తూ వేరొకరికి ఇల్లు గత ప్రభుత్వం మంజూరు చేసే ప్రక్రియ కొనసాగిందని, అటువంటివి పునరావతం కాకుండా పూర్తి హక్కులతో ఇళ్ల స్థలాలను అందించడం వల్ల లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ప్రక్రియను పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వాని దేనని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ ముచ్చులయా యాదవ్‌, కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు, సహాయ కమిషనర్‌ తిరుమలరావు, వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు, హౌసింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.చిల్డ్రన్‌ పార్కు పనులు పరిశీలనప్రజాశక్తి-విజయనగరం టౌన్‌నగరంలోని 17వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్స్‌ పార్క్‌ పనులను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పరిశీలించారు. సోమవారం పార్కులో చేపడుతున్న పనులు ప్రగతిని సమీక్షించారు. పార్కులో ఏర్పాటు చేసిన పిల్లల వ్యాయామ పరికరాలు, క్రీడా సామగ్రి, సుందరీకరణకు చేపడుతున్న అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సూచనలు సలహాలను అందించారు. వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు, ఇన్‌ఛార్జి ఇఇ దక్షిణామూర్తి, కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు, కబడ్డి అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కాళ్ళ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️