ఆక్రమణలకు నిలయం ‘ఆత్మకూరు’

Dec 25,2023 21:19
ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం నాయకులు
ఆక్రమణలకు నిలయం ‘ఆత్మకూరు’
– పట్టించుకోని అధికార యంత్రాంగం..
– చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న పాలకవర్గం..
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు పట్టణం ఆక్రమణలకు నిలయంగా మారిందని, దానికి అడ్డుకట్ట వేయకుంటే ఆత్మకూరులో ప్రభుత్వ స్థలం ఏమీ మిగలదని, స్థానిక సిపిఎం నాయకులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, గంట లక్ష్మీపతి, పట్టణ కార్యదర్శి, డేవిడ్‌ రాజు, మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ షేక్‌.సంధాని పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఆత్మకూరు పట్టణంలో జరుగుతున్న అక్రమ భూకబ్జాలు, అక్రమ కట్టడాలను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంట లక్ష్మీపతి మాట్లాడుతూ గతంలో పంచాయతీ ఉన్న సమయంలో పంట కాలువలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా పొలాలకు నీరు చేరేదన్నారు. 2012లో ఆత్మకూరు మున్సిపాలిటీ కొలువుదిరిందని తెలిపారు. మున్సిపాలిటీ అయిన తర్వాత ఆక్రమణలు పెరిగాయని, వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. 90ఎకరాలు ఉన్న వాగు మొత్తం ఆక్రమణలకు గురవుతుందన్నారు. పెద్దపెద్ద బిల్డింగులు ఏర్పడుతున్నాయని, ఆ 90 ఎకరాల్లో దాదాపు 40 ఎకరాలు బూడిపోయాయని తెలిపారు. డూప్లెక్స్‌ నిర్మాణాలు కూడా చేపడుతున్నారని తెలిపారు. పేదవాడు చిన్న గుడిసె వేసుకుంటే మాత్రం వాటిని వెంటనే అధికారులు తొలగిస్తున్నారన్నారు. పేదవారికి ఒక న్యాయం.. పెత్తందారులకు ఇంకొక న్యాయమా అని ప్రశ్నించారు. ఇకనైనా స్థానిక ఎంఎల్‌ఎ ఈ అక్రమ నిర్మాణాలు జరగకుండా ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖ వారు ఈ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ షేక్‌ సంధాని మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో చెరువు దగ్గర హాస్టల్‌ వద్ద నుండి, సోమశిల సెంటర్‌, మీదుగా నెల్లూరుపాలెం వరకు ఆక్రమణలకు నిలయమైందని తెలిపారు. భూ కబ్జాదారుల కళ్లు రాత్రి పడిందంటే.. ఉదయానకల్లా కబ్జాకు గురవుతుందని, మరుసటి రోజు కబ్జాకు గురైనస్థలం కట్టడాలు కూడా జరుగుతాయన్నారు. మున్సిపల్‌ అధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు కళ్లుండి కబోదుల్లాగా వ్యవహరిస్తూ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ ఉండటం చాలా బాధాకరంగా ఉందన్నారు. మున్సిపాలిటీ ఏర్పడి ఒకటిన్నర సంవత్సరమైందని ఆత్మకూరు మున్సిపాలిటీలో పూర్తి మెజారిటీగా వైసిపి అధికారంలోకి రావడం, రాష్ట్రంలో కూడా వైసిపి అధికారంలో ఉండడం ఇక్కడ మంత్రిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి ఉండడం, మున్సిపాలిటీ బాగా అభివృద్ధి చెందుతుందని, మౌలిక వసతులు మెరుగుపడతాయని మెజార్టీ కౌన్సిలర్లను గెలిపించారని తెలిపారు. వారి ఆశలు ఏమైనట్లు అభివృద్ధి చెందాల్సిన ఆత్మకూరు.. అక్రమాల ఆత్మకూరుగా మారిపోయిందన్నారు. ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆయన గడపగడపకు తిరుగుతూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏదో సేవ చేయాలని ఈ మధ్యకాలంలో తరచూ తిరుగుతున్నారని తెలిపారు. వారికి ఈ అక్రమ కట్టడాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టినా కూడా అక్కడ కట్టే నిర్మాణాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తన కౌన్సిలర్లే కదా, తన పార్టీ శ్రేణులే కదా,, అని ఎంఎల్‌ఎ చూసీ చూడనట్లు వ్యవహరిస్తే ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ స్థలం అనేది ఏమి మిగలదని తెలిపారు. ప్రభుత్వ స్థలాలతో మున్సిపాలిటీకి ఆదాయం రావాలన్నారు. ఇక్కడ ఉండే మున్సిపాలిటీ స్థలంలో కట్టడాలు కట్టి, లీజుకు ఇచ్చినా కూడా ఎంతో ఆదాయం వస్తుందన్నారు. పట్టణ కార్యదర్శి డేవిడ్‌ రాజు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో జరిగే ఆక్రమణలు ఎంఎల్‌ఎ అనుమతి లేకుండా జరగదని, ఆత్మకూరు సిపిఎం అభిప్రాయపడుతుందని తెలియజేశారు. అంతేకాకుండా పట్టణ ప్రజలు కూడా అదే విషయాన్ని చర్చిస్తున్నారన్నారు. ఈ విషయంపై పోరాడేందుకు సిపిఎం తరఫున సిద్ధంగా ఉన్నామన్నారు.

➡️