ఆగని దోపిడీ

Jan 11,2024 21:17

  ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జిల్లాలో ధాన్యం క్రయ, విక్రయాల్లో దోపిడీ ఆగడం లేదు. తూకంలో తేడా, ధరలో దగా షరా మామూలుగా సాగుతోంది. దోపిడీని అరికట్టి రైతులకు బాసటగా నిలవాల్సిన ఉన్నతాధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల మిల్లర్లకు వంతపాడుతున్న సందర్భాలూ తారసపడుతున్నారు. దీంతో, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ధాన్యం రైతులు కంటతపడి పెడుతున్నారు. కాస్తంత చొరవ ఉన్నవారు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో ఫిర్యాదులు చేశారు. ప్రతి ధాన్యపు గింజా దళారుల ప్రమేయం లేకుండా కొనుగోలు చేస్తామంటూ ఇటు అధికారులు, అటు ప్రభుత్వం ప్రగల్భాలాలు పలికిన సంగతి తెలిసిందే. ఈ మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ మాత్రం గడపదాటడం లేదు. – గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన చల్లా రామునాయుడు కౌలు రైతు. అదే మండలంలోని కనక దుర్గ రైస్‌ మిల్లుకు 140 బస్తాలు, శ్రీరాధా కృష్ట ఆగ్రో ఫుడ్స్‌కు 90 బస్తాలు, వెంకటరమణ రైస్‌మిల్లుకు 136 చొప్పున మొత్తం 366 ధాన్యం బస్తాలు విక్రయించాడు. ప్రతి బస్తాలోనూ 42 కేజీల చొప్పున తూకం వేసి, లెక్క మాత్రం 40కేజీలకే కట్టారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధర 40కేజీల బస్తా ధాన్యం ‘ఎ’గ్రేడ్‌ రూ.881.20, సాధారణ రకం రూ.873.20 గా ఉంది. కేజీ సుమారు రూ.22 చొప్పున లెక్కిస్తే రామునాయుడు వద్ద 366 బస్తాలపై ఆయా మిల్లుల యాజమాన్యాలు రూ.8.062 వరకు దోచుకున్నట్టుగా అర్థమౌతోంది. మిల్లు యాజమాన్యాలు తనను నిండా ముంచేశాయంటూ రామునాయుడు ప్రజాశక్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. – జామి మండలం తానవరం గ్రామానికి చెందిన సిరికి చంద్రరావు స్థానిక సూర్యరాజా రైస్‌ మిల్లుకు 6టన్నుల 240కేజీల ధాన్యాన్ని విక్రయించాడు. మిల్లు యాజమాన్యం, ప్రభుత్వ సిబ్బంది చూపుతున్న లెక్క మాత్రం 6టన్నులే. దీన్నిబట్టి టన్నుకు 4కేజీల చొప్పున మినహాయించినట్టు స్పష్టమౌతోంది. ఇదేం అన్యాయం అంటూ మిల్లు యాజమాన్య సిబ్బంది, అక్కడి కస్టోడియన్‌ ఆఫీసర్లను అడిగితే అందరి వద్దా 2కేజీల నుంచి 4కేజీల వరకు అదనంగా తీసుకుంటారని, తరుగు ఉంటుంది కాబట్టి ఆమాత్రం తప్పదని చెప్పారు. అంతే కాదు. ధాన్యం మొత్తం ఒకేసారి నూర్పుచేసి, ఐదు ట్రాక్టర్లతో తీసుకెళ్లగా ఆర్‌బికె సిబ్బంది పూర్తి తేమశాతం ఉన్నట్టు గుర్తించారు. కానీ, మిల్లు వద్దకు వెళ్లేసరికి ఒక ట్రాక్టర్‌ లోడుకి తేమ శాతం తక్కువగా ఉన్నట్టుగా చెప్పి ధర తగ్గించారు. ఇతను కూడా తనను కలిసిన ప్రజాశక్తి ఎదుట తీవ్రంగా విలపించాడు. కేవలం రామునాయుడు, చంద్రరావు మాత్రమే కాదు. జిల్లాలో 90శాతం రైతులది ఇదే వ్యథ. ప్రభుత్వానికి విక్రయిస్తే మిల్లర్లు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారని, ప్రైవేటు వ్యాపారులకిస్తే రూ.200 తక్కువ ధరకు లాగేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డిప్యూటీ తహశీల్దార్‌ కూడా అదనపు ధాన్యం ఇవ్వాల్సిందే అన్నారు…

ఏం చేస్తాం బాబు… మా బాధలు ఎవరికి చెప్పుకుంటాం… ఎవరికి చెప్పినా మా బాధలు, ఇబ్బందులు పట్టడం లేదు. డిప్యూటీ తహశీల్దార్‌కు చెబితే ఆయన కూడా అదనపు ధాన్యం ఇవ్వాల్సిందే అన్నారు…మురపాక సూర్యరాజా రైస్‌ మిల్లుకు 5,900 కేజీలు అప్పగించగా, 5,200కేజీలుగా నమోదు చేశారు. దీనిపై డిఎస్‌ఒకు ఫిర్యాదు చేస్తే ఆయన డిప్యూటీ తహశీల్దార్‌ వద్దకు పంపారు. ఆమె వచ్చి నాను న్యాయం చేయాల్సింది పోయి… అందరూ ఆలాగే ఇచ్చేస్తున్నారు… నువ్వు కూడా ఆలాగే ఇచ్చేరు… ఎందుకొచ్చిన గోల అంటూ నన్నే వెనక్కితగించేందుకు ప్రయత్నించారు. కానీ, నేను మాత్రం అంగీకరించలేదు. కాబట్టి నా దగ్గర తీసుకున్న కేజీల మొత్తానికి బిల్లు ఇప్పించాలని అధికారులను కోరతున్నాను. ఈ మేరకు కలెక్టర్‌కు కూడా జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో ఫిర్యాదు చేశాను. ఆమె ఏమేరకు స్పందిస్తారో? చూడాలి.

భూమిరెడ్డి అప్పారావువసాది, గంట్యాడ మండలం

➡️