ఆత్మహత్యలపై న్యాయ విచారణ చేపట్టాలి

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు భూ సమస్య కారణంగా ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న వారిపై సమగ్ర న్యాయ విచారణ కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరగాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరణాల శివనారాయణ కోరారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో బుధవారం ఎఒకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా శివ నారాయణ మాట్లాడుతూ మాధవరం గ్రామ చేనేత కుటుంబానికి చెందిన సుబ్బారావు, భార్య పద్మావతి, కూతురు వినయ ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నేతలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయ విచారణ జరపాలని, మృతుడి కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం, భూమి ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఒకొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలన్నారు. సిఎం సొంత జిల్లాలో అధికార పార్టీ నాయకులు బరితెగించి భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు జిల్లా ఉన్నతాధికారులు అండగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు పల్లా లక్ష్మీనారాయణ, గంగాధర్‌, సూర్యనారాయణ, శంకర్‌ పాల్గొన్నారు.

➡️